మున్సిపల్ ఎన్నికల్లో అధికార పార్టీ టికెట్ ఆశించి దక్కకపోవడంతో కొందరు రెబల్స్‌గా బరిలో దిగారు. ఎన్నికల్లో టిఆర్ఎస్ హవా కొనసాగినా రెబల్స్ మాత్రం తన ఉనికిని చాటుకున్నారు. 

చాలా మున్సిపాలిటీలలో రెబల్స్ తమకున్న బలంతో వార్డుల్లో కౌన్సిలర్లు గా విజయం సాధించారు. కానీ ఎలాంటి ఫలితం దక్కలేదు. టిఆర్ఎస్ పార్టీ ముందు నుంచి చెబుతున్న విధంగానే ఫలితాల అనంతరం రెబల్స్ ను పెద్దగా పరిగణలోకి తీసుకోలేదు.

Also Read:మల్లన్నసాగర్ భూసేకరణ.. ఇద్దరు కలెక్టర్లకు శిక్ష, హైకోర్టు సంచలన తీర్పు

రెబెల్స్‌తో చేజిక్కించుకునే మున్సిపాలిటీలను ఎక్స్అఫిషియో ఓట్లతో టిఆర్‌ఎస్ పాగా వేసింది. కార్పొరేషన్లు, మునిసిపాలిటీల్లో టిఆర్ఎస్ కు సంపూర్ణ ఆధిక్యత వచ్చిన తర్వాత రెబల్స్‌గా విజయం సాధించిన వారి పరిస్థితి  తప్పనిసరిగా టీఆర్ఎస్‌లో చేరెలా చేసింది.

అధికార పార్టీలో ఎన్నికల అనంతరం ఫలితాలు రాక ముందే రెబల్స్ కారెక్కడం మొదలు పెట్టారు.  సిరిసిల్ల, గజ్వేల్ నియోజక వర్గాలను  పరిశీలించినా ఆ నియోజకవర్గంలోని మునిసిపాలిటిల్లో టిఆర్ఎస్‌కు సంపూర్ణ మెజారిటీ దక్కింది. అయినా రెబల్స్ చాలా చోట్ల విజయం దక్కించుకున్నారు. గజ్వెల్‌లో 10, సిరిసిల్ల లో ఆరుగురు విజయం సాధించారు.

దీంతో ఆ నియోజక వర్గాల్లో రెబెల్స్ కు టిఆర్ఎస్‌లో చేరక తప్పని పరిస్థితి ఏర్పడింది. రెబల్స్ వ్యవహారం పార్టీకి ఎన్నికలకు ముందు తలనొప్పిగా మారినా..... ఫలితాల అనంతరం విజయం సాధించిన రెబెల్స్ గురించి పార్టీ ఏమాత్రం ఆలోచించాల్సిన అవసరం రాలేదు.  

Also Read:సూర్యాపేట మున్సిపల్ వైఎస్ చైర్మెన్ పదవి: టీఆర్ఎస్ కార్యకర్త ఆత్మహత్యాయత్నం

పరిస్థితులకు అనుగుణంగా తాము వ్యవహరించామని పార్టీ నేతలు చెబుతున్నారు. అవసరమైన చోట్ల పార్టీ స్వతంత్రులను బుజ్జగించి పార్టీలోకి చేర్చుకుంది. టిఆర్ఎస్ మెజారిటీ సాధించిన నియోజకవర్గంలో మాత్రం ఎప్పుడైనా రెబెల్స్ పార్టీలో చేరవచ్చన్నసంకేతాలు ఇస్తోంది. రెబెల్స్ కూడా మా పార్టీ నేతలే అని గులాబి నేతలు ఇప్పుడు అంటున్నారు.మొత్తం మీద పార్టీలో స్థానిక పరిస్థితులు కలిసి రాక స్వతంత్రంగా గెలుపొందినా అది కూడా రెబెల్స్ కు పెద్దగా ఎక్కడా కలిసి రాలేదు