హైదరాబాద్: జనసేన పార్టీ  చేపట్టిన వన మహోత్సవ కార్యక్రమానికి వన రక్షణ అనే పేరుని పార్టీ అధ్యక్షులు పవన్ కల్యాణ్ ఖరారు చేశారు. కార్తీక మాసం ప్రారంభం సందర్భంగా మంగళవారం ఉదయం ఆయన ఈ వన రక్షణ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.  హైదరాబాద్ శివార్లలోని తన వ్యవసాయ క్షేత్రంలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా ప్రారంభించారు.  

వన రక్షణ కార్యక్రమానికి ముందు శాస్త్రోక్తంగా పూజాదికాలు నిర్వహించారు.  పవన్ కల్యాణ్ స్వయంగా భూమాతను పూజించి పృథ్వీ సూక్తం పఠించి మొక్కలు నాటే కార్యక్రమానికి అంకురార్పణ చేశారు.
read more భర్తతో విభేదాలు.. అత్తపై పగ: మెట్టినింటికి కన్నం వేసిన కోడలు

ఈ కార్తీకమాసం సందర్భంగా పవన్ కల్యాణ్ దీక్షను చేపట్టారు. ఇందులోభాగంగా ఈ నెలంతా ఆయన ఘనాహారం స్వీకరించకుండా కేవలం ద్రవాహారం మాత్రమే తీసుకుంటారు. వివిధ సందర్భాలను అనుసరించి ఏడాదిలో ఏడు నెలలు ఈ విధంగా పవన్ దీక్షలో ఉంటారని వ్యక్తిగత సిబ్బంది వెల్లడించారు. 

వన రక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించి తాను మొక్కలు నాటిన అనంతరం మిగతా నాయకులు, కార్యకర్తలతో పవన్ దగ్గరుండి మొక్కలు నాటించారు. పర్యావరణ పరిరక్షణ జనసేన సిద్ధాంతాలలో ఒకటని...దాన్ని ప్రతి ఒక్కరు ఫాలో కావాలని సూచించారు. ఈ సిద్ధాంతాన్ని ఆచరణలోకి తీసుకువచ్చే కార్యక్రమమే ఇదని వివరించారు.

ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ వన సంరక్షణ గురించి మాట్లాడుతూ...ఈ పవిత్ర మాసంలో అందరినీ కలుపుకుపోయి పర్యావరణ పరిరక్షణలో చేపట్టాలని సూచించారు. అందులో భాగంగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఊరూరా చేపట్టాలని సూచించారు. ప్రతి జనసేన నాయకుడు, జన సైనికుడు ఈ బృహత్తర కార్యక్రమంలో భాగం కావాలని పిలుపునిచ్చారు. 

read more  దారుణం: పిల్లలను తెగనరికి.. ఆత్మహత్య చేసుకున్న తల్లి

మొక్కలు నాటడం మాత్రమే కాదు వాటిని పెంచి సంరక్షించడం కూడా మనందరి బాధ్యతగా పేర్కొన్నారు. మన సంస్కృతిలో మొక్కలు పెంచడం నుంచి వాటిని రక్షించుకోవడం భాగమేనన్నారు. వేదాలు, పురాణాలు, కావ్యాల్లో మనం ప్రకృతిలో ఎలా మమేకం కావాలో చెప్పారన్నారు. 

కార్తీకంలో నిర్వహించే వనసమారాధనలు వర్గ, కుల భోజనాలు కాకూడదని సూచించారు. అన్ని వర్గాల వారు కలిసి వన సంరక్షణ దిశగా అడుగులు వేసే కార్యక్రమానికి వేదిక కావాలన్నారు. పవిత్రంగా భావించే కార్తీక మాసంలో పర్యావరణ పరిరక్షణకు సంకల్పించామని..అందుకు ప్రతి ఒక్కరు సహకరించాలని సూచించారు.

 

 ఇది ఏదో ఒక నెలకు మాత్రమే పరిమితం కాదన్నారు. జనసేన పార్టీ దీన్ని నిరంతర కార్యక్రమంగా చేపట్టిందని వెల్లడించారు. ఇందులో విద్యార్థులు, మహిళలను ఎక్కువ  భాగస్వాములను చేయాలని సూచించారు. తమ ప్రాంతాల్లో నేల స్వభావానికి అనువైన మొక్కలు పెంచాలని... రావి, వేప లాంటివి ఏ నేలలో అయినా పెరుగుతాయన్నారు.

ఈ కార్యక్రమ అమలు విషయంలో వన ప్రేమికుల సలహాలు తీసుకోవాలన్నారు. ఇందుకోసం తాను ఖమ్మం జిల్లాకు చెందిన పద్మశ్రీ పురస్కార గ్రహీత వనజీవి రామయ్యను కలవనున్నట్లు పవన్ వెల్లడించారు.