నర్మెట్ట మండలం శివభూక్య తండాకు చెందిన బానోత్ రమకు భానుశ్రీ, వరుణ్ సంతానం. ఏం జరిగిందో ఏమో కానీ సోమవారం సాయంత్రం తన ఇద్దరు పిల్లలను కత్తితో నరికిన రమ అనంతరం గొంతు కోసుకుని ఆత్మహత్యాయత్నం చేసింది.

రక్తపు మడుగులో పడివున్న ఆమెను స్థానికులు జనగామలోని ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని చిన్నారుల మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

ఆర్ధిక ఇబ్బందులకు తోడు.. భర్త వేధింపుల కారణంగానే రమ ఈ ఘాతుకానికి పాల్పడి వుండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. ఇద్దరు పిల్లల మృతితో తండాలో విషాద వాతావరణం నెలకొంది. 

కాగా నల్గొండ జిల్లా చింతపల్లి మండలం వర్కాలకు చెందిన శివరాణిని నాగర్‌కర్నూల్ జిల్లా కల్వకుర్తి మండలం బెక్కరకు చెందిన పోతుల శివరెడ్డికి ఇచ్చి ఆరేళ్ల క్రితం వివాహం చేశారు. వీరికి ఐదేళ్ల కుమారుడు యశ్వంత్ రెడ్డి ఉన్నాడు.

Also Read:లవ్ అఫైర్, తల్లిని చంపిన కీర్తి ఈమెనే: తండ్రి ఏమన్నారంటే...

దంపతుల మధ్య మనస్పర్థలు రావడంతో ప్రతిరోజూ గొడవలు జరుగుతుండటంతో ఆమె కుమారుడిని తీసుకుని పుట్టింటికి వచ్చేసింది. పని నిమిత్తం తల్లీదండ్రులు హైదరాబాద్‌కు వెళ్లడంతో శివరాణి గత ఎనిమిది నెలలుగా వర్కాలలోనే ఉంటుంది.

ఈ క్రమంలో వారికున్న ఐదెకరాల పొలాన్ని శివరాణి పేరిట రాయించారు తల్లీదండ్రులు. అయితే ఆ భూమిని విక్రయించి తనకు డబ్బులు ఇవ్వాల్సిందిగా శివరెడ్డి.. భార్యను తిరిగి వేధించడం మొదలుపెట్టాడు. దీపావళి పండుగకు రావాల్సిందిగా శివరాణికి భర్త ఫోన్ చేసి పిలవగా.. తాను రానని తేల్చి చెప్పింది.

దీంతో అతను తన బిడ్డను తనకు అప్పగించాల్సిందిగా గొడవకు దిగాడు. దీనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన శివరాణి.. అవసరమైతే కొడుకునైనా చంపుకుంటా గానీ నీకు మాత్రం ఇచ్చేది లేదని తేల్చి చెప్పేసింది.

ఈ క్రమంలో శుక్రవారం రాత్రి కుమారుడు యశ్వంత్‌కి మరుగుదొడ్లను శుభ్రం చేసే యాసిడ్ తాగించి నిద్రపుచ్చింది. శనివారం ఉదయం నిద్రలేచి చూసే సరికి కుమారుడు మరణించడాన్ని చూసి తట్టుకోలేక భయంతో ఆమె సైతం యాసిడ్ తాగి 100కు సమాచారం ఇచ్చింది.

Also Read:ఇద్దరితో లవ్, శవం పక్కన ప్రియుడితో కలిసి..: తల్లిని చంపిన కీర్తి అరెస్టు

వెంటనే వర్కాలలోని ఆమె ఇంటికి చేరుకున్న పోలీసులు శివరాణిని ఆసుపత్రికి తరలించి అనంతరం పోలీస్ స్టేషన్‌కు తరలించారు. చిన్నారి మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం దేవరకొండ ఆసుపత్రికి తరలించారు. తల్లిదండ్రుల మధ్య మనస్పర్థలకు అన్యాయంగా అభం శుభం తెలియని చిన్నారి మరణించడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.