హైదరాబాద్: 2019 సంవత్సరానికి స్వస్తి పలుకుతూ 2020సంవత్సరంలోకి అడుగుపెడుతున్న సమయంలో హైదరాబాద్ మెట్రో సరికొత్త రికార్డును సృష్టించింది. మంగళవారం ఉదయం నుండి అర్థరాత్రి వరకు రికార్డు స్థాయిలో ప్రయాణికులు మెట్రోలో ప్రయాణించారట. ఇలా పాత సంవత్సరానికి ముగింపు, కొత్త సంవత్సరాని ఆరంభం హైదరాబాద్ మెట్రోకు బాగా కలిసివచ్చిందన్నమాట. 

నూతన సంవత్సర వేడుకలను పురస్కరించుకుని మెట్రో రైలు సర్వీసులు మంగళవారం అర్థరాత్రి 2 గంటలవరకు కొనసాగాయి. దీంతో ఈ ఒక్కరోజే రికార్డుస్థాయిలో 4,60,000 పైచిలుకు ప్రయాణికులు మెట్రోలో ప్రయాణించినట్లు అధికారులు తెలిపారు. ఇప్పటివరకు ఒక్కరోజేలో అత్యధిక ప్రయాణికులు మెట్రోలో ప్రయాణించిన రికార్డు  ఇదేనని అధికారులు తెలిపారు. 

సాధారణంగా రోజువారిగా మెట్రో రైళ్లలో 4,10,000 నుండి 4,20,000 వేల వరకు ప్రయాణికులు ప్రయాణిస్తుంటారట. కానీ నూతన సంవత్సర వేడుకల సందర్భంగా దాదాపు 40వేల మంది అధికంగా ప్రయాణించినట్లు మెట్రో వర్గాలు తెలియజేశారు. ఈ రోజున మియాపూర్-ఎల్బీ నగర్ రూట్ లో 2,68,900, నాగోల్-రాయదుర్గ్  రూట్ లో 1,93,366 మంది ప్రయాణించినట్లు వెల్లడించారు. 

read more  నూతన సంవత్సరం వేళ... భారీగా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు

నూతన సంవత్సర వేడుకలను దృష్టిలో వుంచుకుని మెట్రో వర్గాలు చేపట్టిన ప్రత్యేక సదుపాయలవల్లే ఈ రికార్డు సాధ్యమయ్యిందని హెచ్‌ఎంఆర్ఎల్ మేనేజింగ్ డైరెక్టర్ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. అర్థరాత్రి వరకు మెట్రో ప్రయాణాన్ని కల్పించడం, మద్యం సేవించిన వారిని కూడా అనుమతించడం వంటి ప్రత్యేక చర్యలు తీసుకున్నట్లు ఆయన తెలిపారు. 

హైదరాబాద్ మెట్రో రైల్ కార్పోరేషన్ మందుబాబులకు బంపర్ ఆఫర్ ఇచ్చింది. మద్యం సేవించిన వారికి మెట్రో రైలులో అనుమతిస్తున్నట్లు మెట్రో ఎండీ ముందుగానే ఎన్వీఎస్ రెడ్డి ప్రకటించారు. న్యూఇయర్ వేడుకల సందర్భంగా ప్రయాణీకుల సౌకర్యార్థం మెట్రో పనివేళలనుఅర్థరాత్రి వరకు పొడిగించారు.

ఈ క్రమంలో మద్యం సేవించిన వారికి సైతం అనుమతి ఇవ్వాలని నిర్ణయించారు. అయితే ఆ సమయంలో ఇతరులకు ఇబ్బంది కలిగించకూడదని, ఒకవేళ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠినచర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.

read more  న్యూ ఇయర్ వేళ ప్రయాణికులకు మెట్రో గుడ్‌న్యూస్

 హైదరాబాద్‌లో ప్రతి సంవత్సరం న్యూఇయర్ వేడుకల సందర్భంగా ప్రతి ఏటా ఘోర రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుంటూ ఉంటాయి. వీటి కారణంగా ఎంతోమంది ప్రాణాలను కోల్పోయిన సంగతి తెలిసిందే.దీనిపై దృష్టి పెట్టిన హైదరాబాద్ మెట్రో అధికారులు ఆ చర్యలను చేపట్టినట్టు తెలుస్తోంది. ఆ తర్వాత రోజు నుంచి మెట్రో రైళ్లు ఉదయం 6.30 నుంచి రాత్రి 11 గంటల వరకు నడుస్తాయని ఆయన ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు.

మరోవైపు ఎంఎంటీఎస్ సర్వీసులను సైతం మంగళవారం అర్థరాత్రి వరకు పొడిగించారు. అర్థరాత్రి 1.30కి లింగంపల్లి-ఫలక్‌నూమా ఎంఎంటీఎస్, అర్థరాత్రి 1.15కి లింగంపల్లి-హైదరాబాద్‌ ఎంఎంటీఎస్ నడుస్తాయని అధికారులు తెలిపారు.