నూతన సంవత్సరం వేళ... భారీగా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు
మూడు కమిషనరేట్‌ల పరిధిలో మంగళవారం రాత్రి నుంచి బుధవారం తెల్లవారుఝాము వరకు భారీగా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదయ్యాయి.
నూతన సంవత్సరం రానే వచ్చింది. ఈ సంవత్సరాన్ని స్వాగతించేందుకు ముందు రోజు రాత్రి యువత సంబరాలు చేసుకుంది. హైదరాబాద్ నగరంలోని చాలా ప్రాంతాల్లో ప్రత్యేకంగా న్యూ ఇయర్ ఈవెంట్స్ నిర్వహించారు. జిగేలుమనే దీపాల కాంతులు, డీజేల హోరులు, సెలబ్రెటీల ఆట, పాటలతో హుషారెత్తించారు.
ఆ ఆటపాటలకు జనాలు కూడా చిందులు వేశారు. చుక్కేసి కిక్కులో మునిగితేలారు. అయితే... మద్యం తాగి మాకు చిక్కితే మాత్రం వదిలపెట్టమంటూ పోలీసులు ఇప్పటికే వార్నింగ్ లు ఇచ్చారు. ఆ వార్నింగ్ లను చాలా మంది లెక్కచేయనట్లు తేలింది. డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులో చాలా మందే దొరికారు.
మూడు కమిషనరేట్‌ల పరిధిలో మంగళవారం రాత్రి నుంచి బుధవారం తెల్లవారుఝాము వరకు భారీగా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదయ్యాయి. పాత సంవత్సరానికి వీడ్కోలు, కొత్త సంవత్సరానికి స్వాగతం సందర్భాలను పురస్కరించుకుని వివిధ వయస్సులవారు మద్యం సేవించి వాహనాలు పట్టుబడుతూ పోలీసులకు పట్టుబడ్డారు.
హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో 951 కేసులు, రాచకొండ కమిషనరేట్ పరిధిలో 281, సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో 873 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదయ్యాయి.