నూతన సంవత్సర వేడుకలకు హైదరాబాద్ నగరం సిద్ధమయ్యింది. డిసెంబర్ 31 వ రాత్రి సంబరాల్లో మునిగి తేలేందుకు నగర వాసులు కూడా ఎదురు చూస్తున్నారు. కాగా... ఈ వేడుకల తర్వాత ప్రజలు సురక్షితంగా ఇంటికి చేరేందుకు మెట్రో అదనపు సేవలు అందించడానికి ముందుకు వచ్చింది.

ఈ న్యూ ఇయర్ వేడుకల్లో భాగంగా.. హైదరాబాద్ మెట్రో నగరవాసులకు శుభవార్త తెలియజేసింది.  డిసెంబర్‌ 31 రాత్రి మద్యం తాగి వచ్చినా మెట్రో రైలు ప్రయాణం చేసేందుకు అనుమతిస్తారు. 

మెట్రోలో ప్రయాణం చేసే సమయంలో ఇతరుల పట్ల దురుసుగా ప్రవర్తిస్తే మాత్రం చర్యలు ఉంటాయని హైదరాబాద్‌ మెట్రో అధికారులు హెచ్చరించారు. డిసెంబర్‌ 31న రాత్రి మెట్రో రైళ్ల సమయాలను పొడిగించామని మెట్రో ఎం.డి. ఎన్వీఎస్‌ రెడ్డి తెలిపారు. 

ఇప్పటి వరకు చివరి రైలు రాత్రి 11గంటలకు బయల్దేరి 12 గంటల వరకు నడుస్తుండగా, 31వ తేదీ అర్ధరాత్రి మాత్రం 1 గంటకు (తెల్లవారితే జనవరి1వ తేదీ) చివరి రైలు బయల్దేరి సుమారు 2 గంటల కల్లా చివరిస్టేషన్‌కు చేరుకుంటుందని తెలిపారు. ఎవరూ, ఎక్కడ, ఏం చేసినా.. గుర్తించేందుకు మెట్రో కారిడార్‌లలో అడుగడుగునా సీసీ కెమెరాల నిఘా ఉందన్న విషయాన్ని ప్రయాణికులు గుర్తించాలన్నారు.