పోలీస్ స్టేషన్‌లలో అందించే సేవలను ప్రజలకు మరింత చేరువ చేసేందుకు గాను హైదరాబాద్ పోలీసులు కొత్త పద్ధతికి శ్రీకారం చుట్టారు. ఇకపై ప్రజలు ఫిర్యాదు చేయాలంటే పోలీస్ స్టేషన్‌కు వెళ్లాల్సిన అవసరం లేదని, ఆయా ప్రాంతాల్లో సంచరించే పెట్రోకార్ సిబ్బందికి లిఖిత పూర్వకంగా ఫిర్యాదు ఇస్తే సరిపోతుందని పోలీసులు తెలిపారు.

దేశంలోనే మొట్టమొదటిసారిగా ఈ విధానాన్ని హైదరాబాద్‌లో అమలు చేస్తున్నట్లు నగర పోలీస్ కమీషనర్ అంజనీకుమార్ తెలిపారు. ఈ మేరకు ఆయన అన్ని జోన్ల ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

Also Read:హైదరాబాద్ లో మహిళా టెక్కీ మిస్సింగ్.... 11 రోజులుగా కనిపించకుండాపోయి..

సాధారణంగా ప్రజలు ఫిర్యాదు చేయాలంటే స్టేషన్‌కు వెళ్లాలని.. ఆ సమయంలో రైటర్, స్టేషన్ హౌస్ ఆఫీసర్ అందుబాటులో ఉండకపోతే వారు వచ్చే వరకు ఎదురు చూడాల్సి ఉంటుందన్నారు. అయితే ఇకపై ప్రజలకు ఆ కష్టాలు ఉండవని అంజనీకుమార్ వెల్లడించారు.

నగరంలో ఎక్కడ ఏ నేరం జరిగినా.. ముందుగా చేరుకునేది పెట్రోకార్, బ్లూకోర్ట్స్ సిబ్బంది మాత్రమేనని.. అందువల్లే విజిబుల్ పోలీసింగ్ పెరుగుతోందని సీపీ తెలిపారు. ప్రజలతో ఎక్కువ శాతం ప్రత్యక్ష సంబంధాలు ఉండేది వారికేనని, అందువల్లే ఫిర్యాదును స్వీకరించి... ఎఫ్‌ఐఆర్ నమోదు చేసే అధికారాలిచ్చామన్నారు.

Also Read:మున్సిపల్ ఎన్నికలు 2020: కేసీఆర్ కు బిజెపి భయం, కారణం ఇదీ...

ఈ వ్యవస్థను అమల్లోకి తీసుకురావడానికి నెల రోజులుగా తీవ్ర స్థాయిలో కసరత్తు చేశామని అంజనీకుమార్ వెల్లడించారు. దీనిపై ట్రయల్స్ వేసి.. లోటుపాట్లను గుర్తించి, తప్పులను సరిచేశామని సీపీ పేర్కొన్నారు.

ఫిర్యాదు చేసే సమయంలో పౌరులు తప్పనిసరిగా తమ పేరు, మొబైల్ నంబర్, పూర్తి చిరునామాను పెట్రోకార్ సిబ్బందికి అందించాల్సి ఉంటుందన్నారు. ప్రయోగాత్మకంగా తొలుత హైదరాబాద్‌లో ఈ విధానాన్ని అమలు చేసి త్వరలో రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లోనూ దీనిని అమలు చేసేందుకు పోలీస్ శాఖ ప్రణాళికలు రూపొందిస్తోంది.