హైదరాబాద్ లో ఓ మహిళా ఉద్యోగి మిస్టరీ కేసు ఇప్పుడు కలకలం రేపుతోంది. యాపిల్ కంపెనీలో పనిచేస్తున్న రోహిత(31) అనే యువతి దాదాపు 11 రోజులుగా కనిపించకుండా పోయింది.

డిసెంబర్ 26న మధ్యాహ్నం రోహిత మిస్సైందని ఆమె తమ్ముడు పరీక్షిత్ గచ్చిబౌలి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మిస్టరీగా మారిన రోహిత  మిస్సింగ్ కేసుపై దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. ఇటు కుటుంబ సభ్యులు, అటు పోలీసులు రోహిత కోసం గాలిస్తున్నారు. 

కాగా... ఆమె కనిపించడం లేదంటూ సోషల్ మీడియాలో కూడా పోస్టులు పెట్టారు. కాగా.. రెండ్రోజుల క్రితం సికింద్రాబాద్ తాజ్ మహల్ హోటల్.. ప్యాట్నీ సర్కిల్ దగ్గర కనిపించినట్లు కుటుంబ సభ్యులకు సమాచారం రావడంతో ఆ చుట్టు పక్కల సీసీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు పోలీసులు.

మాదాపూర్ లోని ఆపిల్ కంపెనీ లో సాఫ్ట్ వేర్ ఉద్యోగినిగా రెండేళ్లుగా పనిచేస్తోంది రోహిత. 10రోజులవుతున్నా.. రోహిత ఆచూకీ ఇంత వరకు లభించకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రోహిత తల్లి తండ్రులు చాదర్ ఘాట్ లో ఉంటుండగా.. భర్త అభిషేక్  ప్రైవేట్ జాబ్ చేస్తున్నాడు. మిస్సింగ్ కేసుపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు గచ్చిబౌలి పోలీసులు. ఆమె ఇంట్లో నుంచి ఎందుకు వెళ్లిపోయింది అనే విషయం తెలియడం లేదని కుటుంబసభ్యులు చెబుతున్నారు.