విదేశీ మద్యం కోసం ఓ వైన్ షాప్ లో దొంగతనం జరిగిన సంఘటన హైదరాబాద్ లోని ఉప్పల్ పరిధిలో చోటుచేసుకుంది.ఆ వైన్ షాప్ లో విదేశీ మద్యం దొరుకుతుందని తెలుసుకుని వాటిని ఎలాగైనా కాజేయాలని దొంగలు భావించారు.అందకు ఎంతో చాకచక్యంగా రెక్కీ నిర్వహించి చివరకు విదేశీ మద్యాన్ని కాజేశారు. ఈ దొంగతనం గురించిన వివరాలిలా ఉన్నాయి.

ఉప్పల్‌ క్రాస్‌ రోడ్డు నుంచి నాగోల్‌ వెళ్లే ప్రధాన రహదారి పక్కన ఎస్‌వీడీ మద్యం షాపు ఉంది. ఈ దుకాణదారులు ప్రభుత్వ అనుమతితో విదేశీ మద్యాన్ని కూడా విక్రయిస్తున్నారు. అయితే ఈ కాస్లీ విదేశీ మద్యంపై కొందరు దొంగల కన్ను పడింది. దీంతో ఈ మందుబాటిళ్లను కాజేయడానికి పథకం వేశారు. ఈ పథకం ప్రకారం అర్ధరాత్రి సమయంలో వైన్ షాపు పై కప్పు రేకులను కట్టర్‌తో కట్‌చేసి లోపలికి దొంగలు ప్రవేశించారు. ఈ కౌంటర్‌లో ఉన్న రూ10వేలు, విదేశీ మద్యం బాటిళ్లను దొంగిలించారు.అంతే కాకుండా ఈ దోపిడీకి సంబంధించిన ఆధారాలు దొరక్కుండా సీసీ కెమెరాలను కూడా తస్కరించారు.   

ఉదయం షాప్ ఓపెన్ చేసిన వైన్ షాపు సిబ్బంది దొంగతనం జరిగినట్లు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దొంగల కోసం గాలింపు చేపట్టారు.