తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ వ్యవహారం ‘ఉట్టికి ఎగరలేడు గానీ ఆకాశానికి నిచ్చెనలేసినట్లు’గా ఉంది. కేంద్రప్రభుత్వానికి వ్యతిరేకంగా ఫ్రంట్ పెట్టి నాయకత్వం వహిస్తానని స్వయంగా చెప్పిన విషయమే ఇపుడు అంతా చర్చనీయాంశంగా మారింది. కెసిఆర్ ప్రకటనపై అంత చర్చ ఎందుకు జరుగుతోందంటే, మొదటి నుండి ముఖ్యమంత్రి వ్యవహారశైలి వివాదాస్పదమే కాబట్టి.

మూడున్నరేళ్ళ క్రితం తెలంగాణాకు ముఖ్యమంత్రి అయిన దగ్గర నుండి రాష్ట్రంలో అన్నీ సమస్యలే. ఒక్క సమస్యను కూడా సమర్ధవంతంగా ఇంత వరకూ ఎదుర్కోలేకపోయారు. పైగా కొత్త సమస్యలను అనేకం నెత్తిమీదకు తెచ్చుకున్నారు. ఏదో అదృష్టం కొద్ది ప్రభుత్వ పాలన అలా సాగిపోతోంది అంతే.

పాలనలో ఇంత వరకూ కెసిఆర్ ముద్ర అన్నదే కనబడలేదింత వరకూ. తెలంగాణా ఉద్యమంలో చెప్పిన దానికి కెసిఆర్ ఇపుడు చేస్తున్నదానిపై జనాలే మండిపోతున్నారు. ఇక, ప్రతిపక్షాల సంగతి చెప్పాల్సిన పనేలేదు. రాష్ట్రంలోని పరిస్ధితులనే చక్కపెట్టలేకపోయిన కెసిఆర్ జాతీయ స్ధాయిలో ఎన్డీఏకి ప్రత్యామ్నాయంగా ఫ్రంట్ ఏర్పాటు చేసి నాయకత్వం వహిస్తానని చెప్పటమే విచిత్రంగా ఉంది.

బహుశా 1982లో తెలుగుదేశంపార్టీ ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ ను కెసిఆర్ ఆదర్శంగా తీసుకోవాలని అనుకున్నారేమో. ఎన్టీఆర్ అప్పట్లో కాంగ్రెస్ కు వ్యతిరేకంగా జాతీయ స్ధాయిలో నేషనల్ ఫ్రంట్ పెట్టి దేశంలో చరిత్ర సృష్టించిన సంగతి అందరికీ తెలిసిందే. అప్పట్లో కేంద్రం చేతిలో అపరమితమైన అధికారాలుండేవి. రాష్ట్రాల్లో అప్పుడప్పుడే ప్రాంతీయపార్టీలు బలం పుంజుకుంటున్నాయి. అధికారాల్లో తమకూ సమాన వాటా కావాలని, తమపై కేంద్రం పెత్తనాన్ని సహించకూడదనే ఆలోచన ప్రాంతీయ పార్టీల్లో మొదలైంది.

దాంతో కాంగ్రెస్ కు వ్యతిరేకంగా ఎన్టీఆర్ రంగంలోకి దిగారు. అంతుకు ముందే రాష్ట్రంలో చరిత్ర సృష్టించి ఉండటంతో ఎన్టీఆర్ పేరు జాతీయ స్ధాయిలో మారుమోగిపోతోంది. దానికి తోడు కాంగ్రెస్ కు వ్యతరేకంగా రంగంలోకి దిగటంతో అప్పటి జాతీయ పార్టీల నేతలు మద్దతుగా నిలిచారు. కాంగ్రెస్ కు వ్యతిరేకంగా 14 పార్టీలను ఏకంచేసి విజయవాడలో భారీ బహిరంగ సభ నిర్వహించారు.

తర్వాత మద్రాసులో కూడా మరోసభ ఏర్పాటు చేశారు. అదే ఊపులో హర్యానలో దేవీలాల్ కు మద్దతుగా ప్రచారం చేసి అక్కడ కూడా కాంగ్రెస్ ను దెబ్బతీశారు. దాంతో ఎన్టీఆర్ ఇమేజి జాతీయ స్ధాయిలో పెరిగిపోయింది. అదే సమయంలో దేశంలో రాజకీయ శూన్యత ఉంది.  అప్పటి నేతలపై అంతో ఇంతో నమ్మకం ఉంది కాబట్టి జనాలు కూడా నేషనల్ ఫ్రంట్ ను ఆదరించారు.

కానీ నాటి పరిస్ధితులు ఇపుడు లేవన్న విషయం అందరకీ తెలిసిందే. ప్రతీ  రాష్ట్రంలోనూ కుప్పలు తిప్పలుగా ప్రాంతీయ పార్టీలు పెరిగిపోయాయి. అదే సమయంలో జాతీయ పార్టీలపైన కూడా జనాలకు పెద్దగా నమ్మకం లేదు. ఇటువంటి పరిస్ధితుల్లో కెసిఆర్ కు మద్దతుగా ఎవరు నిలబడతారన్నదే పెద్ద ప్రశ్న. అంతెందుకు ధక్షిణాధి రాష్ట్రాల ముఖ్యమంత్రుల మద్దతే ఇంత వరకూ లేదు.

ముఖ్యమంత్రుల్లో ఎవరికి వారు ప్రధానమంత్రి నరేంద్రమోడి ప్రాపకం కోసం పాకులాడుతున్నపుడు కెసిఆర్ మాట ఎవరు వింటారు? పైగా దేశం మొత్తం మీద సుమారు 20 రాష్ట్రాల్లో బిజెపినే అధికారంలో ఉంది. ఇప్పటికైతే దేశంలో మోడికి ఎదురులేదన్నది వాస్తవం. 2019 ఎన్నికల్లో కూడా మోడికి ఇబ్బంది ఉండకపోవచ్చు. బహుశా కెసిఆర్ ప్రయత్నాలు 2024 సమయంలో పుంజుకునే అవకాశాలున్నాయేమో చూడాలి?