రాష్ట్రపతిగా ప్రణబ్ చివరి రోజున ప్రధాని మోదీ ఓ లేఖను ఆయనకు ఇచ్చారు లేఖలో మోదీ ప్రణబ్ ను పొగడ్తలతో ముంచెత్తారు
మోదీ లేఖ నా మనసుకు హత్తుకుందని.. మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ అన్నారు. రాష్ట్రపతిగా ప్రణబ్ చివరి రోజున ప్రధాని మోదీ ఓ లేఖను ఆయనకు ఇచ్చారు. ఆ లేఖను ఈరోజు ప్రణబ్ ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు.‘మోదీ లేఖ నా మనసుకు హత్తుకుంది’ అంటూ ప్రణబ్ ట్వీట్ చేశారు. దాంతో పాటు లేఖను కూడా పోస్ట్ చేశారు.
ఆ లేఖలో మోదీ ప్రణబ్ ను పొగడ్తలతో ముంచెత్తారు.‘మూడేళ్ల ముందు ఇతర రాష్ట్రానికి చెందిన వ్యక్తిగా దిల్లీలో అడుగుపెట్టిన నా ముందు ఎన్నో సవాళ్లు... ఆ సమయంలో మీరు నాకు అందించిన మార్గదర్శకత్వం మరువలేనిది. మీ జ్ఞానం, ప్రేమ, సూచనలు నాలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించాయి. మీ మేధాశక్తి నాకు, మా ప్రభుత్వానికి ఎంతో మేలు చేసింది. తర,తమ భేదాలు లేకుండా పని చేసిన మీ విధానం నాకు బాగా నచ్చింది. మన పార్టీలు వేరు, ఆదర్శాలు, సిద్ధాంతాలు వేరయినప్పటికీ అవేవీ పట్టించుకోకుండా మాతో కలిసి మెలిసి పనిచేశారు. మీ నాయకత్వం, నిస్వార్థంతో పనిచేసే విధానం భావి తరాలకు ఆదర్శప్రాయం. ‘రాష్ట్రపతి జీ’ మీతో కలిసి పనిచేయడం నాకు ఎంతో ఆనందానిచ్చింది. ఇట్లు మీ ప్రధాని’ అంటూ ముగించారు.
