వికారాబాద్ జిల్లాలో ప్రేమ జంట ఆత్మహత్య

vikarabad lovers suicide
Highlights

  • వికారాబాద్ జిల్లాలో విషాదం
  • ప్రేమకు పెద్దలు అంగీకరించలేదని  ప్రేమ జంట ఆత్మహత్య

ఆ ఇద్దరూ గత సంవత్సర కాలంగా ఒకరినొకరు గాడంగా ప్రేమించుకుంటున్నారు. ఇంట్లో వాళ్లని ఒప్పించి పెళ్లి చేసుకుని సుఖంగా జీవించాలనుకున్నారు. అయితే వీరి ప్రేమకు ఇరువురి కుటుంబాలు అంగీకరించలేదు. దీంతో కుటుంబసభ్యులను కాదని పెళ్లి చేసుకోలేక, ఒకరిని విడిచి ఒకరు ఉండలేక ఓ కఠిన నిర్ణయాన్ని తీసుకున్నారు. ఎలాగు కలిసి బ్రతికే అదృష్టం లేదు కాబట్టి కలిసి చనిపోదామని నిర్ణయించుకుని ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ దుర్ఘటన వికారాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది.

ఈ ప్రేమ జంట ఆత్మహత్యకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. వికారాబాద్‌ జిల్లా దౌల్తాబాద్‌ మండలంలోని పోల్కంపల్లి గ్రామానికి చెందిన కోట్టం ప్రవీణ్‌కుమార్‌(21), అదే గ్రామానికి చెందిన ఎర్రోళ్ల మంజుల(18) గత ఏడాది కాలంగా ప్రేమించుకుంటున్నారు. వీరిద్దరి ప్రేమ వ్యవహారం ఇరువురి ఇండ్లల్లో తెలిసి వీరిని మందలించారు. అంతే కాకుండా మంజులకు వేరే అబ్బాయితో పెళ్లి నిశ్చయం చేశారు. దీంతో ఇక తమ ప్రేమను బ్రతికించుకోలేమని బావించిన ఈ ప్రేమజంట ఆత్మహత్యకు పాల్పడింది. అర్థరాత్రి సమయంలో పొలంవద్దకు వెళ్లి చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. దీంతో ఇరువురి కుటుంబసభ్యులు సంఘటన స్థలానికి చేరుకుని కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.

 సంఘటన స్థలాన్ని స్థానిక ఎస్సై చంద్రశేఖర్‌ పరిశీలించి వివరాలు తెలుసుకున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం కొడంగల్‌ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. బాధిత కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. 

loader