ఓ చిన్న కారణంతో ఇద్దరు మహిళలు నడి రోడ్డుపై గొడవపడ్డారు. ఈ మహిళలు ఒకరిపై ఒకరు సిగపట్లకు దిగారు. గొడవ తర్వాత రోడ్డుపై నానా హంగామా సృష్టించి తమ కుటుంబ పరువు తీశామని మనస్థాపానికి గురయ్యారు. దీంతో పురుగులమందు ఇద్దరు మహిళలు ఆత్మహత్యకు పాల్పడిన విషాద సంఘటన సూర్యాపేట జిల్లాలో చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెళితే....అర్వపల్లి మండలం ఉయ్యాలవాడకు చెందిన గుట్టమ్మ, సరోజలకు  ఇవాళ తెల్లవారుజామున గొడవపడ్డారు. చిన్న విషయంపై మాటా మాటా పెరిగి ఒకరిపై ఒకరు దాడిచేసుకునే దాక వెళ్లింది. నడిరోడ్డుపై అందరూ చూస్తుండగా సిగపట్లకు దిగారు. దీంతో అక్కడు వున్న కొందరు వీరిని విడదీసి సర్దిచెప్పి ఇండ్లకు పంపించారు. అయితే ఇంటికి వెళ్లాక ఈ గొడవ గురించి ఆలోచించి రోడ్డుపై కుటుంబం పరువును తీశామని భావించిన ఈ ఇద్దరు మహిళలూ పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. వీరిని కుటుంబసభ్యులు ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యలోనే మృతిచెందారు.

 ఈ గొడవ, ఆత్మహత్య తదితర అంశాలపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రి తరలించారు. చిన్న గొడవ ఇద్దరి ప్రాణాలను బలితీసుకోడంతో ఇరువురి కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు.