వరంగల్ అర్బన్ జిల్లా కలెక్టర్ ఆమ్రపాలి కాటా వివాహం డయ్యూ డామన్ ఎస్పీ సమీర్ శర్మతో జమ్మూ కాశ్మీర్ లో అంగరంగ వైభవంగా జరిగిన విషయం తెలిసిందే. ఈ పెళ్లి కి టీఆర్ఎస్ వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేష్, ఎంపీపీ మార్నేని రవీందర్ రావులతో పాటు మరికొంతమంది నాయకులు హాజరయ్యారు. ప్రత్యేక ఆహ్వానంపై వీరు ఈ పెళ్లి వేడుకల్లో హాజరైనట్లు సమాచారం.

అయితే ఈ పెళ్లిలో కలెక్టర్ ఆమ్రపాలి , సమీర్ శర్మ ల బందువులు తప్ప మిగతా రాజకీయ ప్రముఖులు గానీ, అధికారులు గానీ పాల్గొనలేదు. ఈ క్రమంలో కేవలం  ఎమ్మెల్యే రమేష్ తన అనుచరులతో కలిసి పాల్గొనడం తీవ్ర చర్చకు దారితీస్తోంది. ఇటీవల వరంగల్ జిల్లాలో టీఆర్ పార్టీ ప్లెక్సీ పై కలెక్టర్ ఆమ్రపాలి ఫోటో దర్శనమిచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో మళ్లీ ఎవరికీ ఆహ్వానం లేని ఈ కలెక్టరమ్మ పెళ్లిలో ఈ టీఆర్ఎస్ ఎమ్మెల్యే కనిపించడంతో రాజకీయంగా కొంత చర్చ జరుగుతోంది.

అయితే పెళ్లి  జమ్మూ కాశ్మీర్ లో ఉండటంతో తోటి అధికారులను, రాజకీయ ప్రముఖులను ఆహ్వానించలేక పోయిన ఆమ్రపాలి ఇక్కడ భారీగా విందులు ఏర్పాటు చేశారు. ఈ నెల 22న వరంగల్, 25 న హైదరాబాద్‌లో తన సన్నిహితులకు విందు ఇవ్వనున్నారు. ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రముఖుల సమక్షంలో రిసెప్షన్ నిర్వహించేందుకు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తయినట్లుగా తెలుస్తోంది. ఆ తర్వాత 26 నుంచి మార్చి 7 వరకు భర్త సమీర్‌తో కలిసి ఆమ్రపాలి టర్కీ పర్యటన వెళ్లనున్నట్టు తెలుస్తోంది.