హోలీ పండగ పూట అధికార టీఆర్ఎస్ పార్టీ నాయకులు అనైతిక చర్యలకు పాల్పడుతూ పోలీసులకు రెడ్ హ్యండెడ్ గా చిక్కారు. హైదరాబాద్ శివారులోని ఓ ఫాం హౌస్ లో పేకాట ఆడుతూ జల్సాలు చేస్తూ ఎస్ఓటీ పోలీసులకు చిక్కారు. పట్టుబడిన వారిలో డివిజన్ స్థాయి నాయకులు ఉండటంతో అధికార టీఆర్ఎస్ పార్టీలో తీవ్ర చర్చనీయాంశమయ్యింది. అధికార పార్టీ అండదండలతో రెచ్చిపోయిన ఈ చోటా మోటా నాయకులు నాయకులు ఇలా చట్టాలను అతిక్రమించి అడ్డంగా పోలీసులకు దొరికిపోయారు.
 


హైదరాబాద్ శివారులోని రంగారెడ్డి జిల్లా కందుకూరు వద్ద గల ఓ ఫామ్‌హౌస్‌లోనే ఈ తతంగం జరిగినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా సమాచారం అందింది. దీంతో ఎస్‌వోటీ పోలీసుల సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో ఫాంహౌస్‌లో అక్రమంగా పేకాట ఆడుతున్న టీఆర్ఎస్ లీడర్లు పట్టుబడ్డట్లు తెలిసింది. మొత్తం 14 మంది పేకాట రాయుళ్లను అదుపులోకి తీసుకున్న పోలీసులు వారి నుండి  2లక్షల 50 వేలతో పాటు సెల్ ఫోన్లు, వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన వారిలో అత్తాపూర్ టీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షుడు వనం శ్రీరాంరెడ్డి తో పాటు అతని అనుచరులు, మరికొంత మంది అధికార పార్టీ నాయకులు ఉన్నట్లు పోలీసు వర్గాలు చెబుతున్నాయి. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.