సార్వత్రిక ఎన్నికలకు ఇంకా ఏడాది సమయమున్నా రాష్ట్రంలో మాత్రం అప్పుడే ఎన్నికల వేడి మొదలైంది. సాధారణంగా అధికార పార్టీల నుంచి వలసలు ఎన్నికల సమయంలో జరుగుతుంటాయి. పార్టీ నుంచి సీటు రాకనో, గెలుపు అవకాశాలు లేకనో అధికార పార్టీలను మారే నాయకులను చూస్తుంటాం. కానీ అధికార టీఆర్ఎస్ లో ఆ వేడి ముందుగానే రాజుకుంది. ఖమ్మం జిల్లాకు చెందిన  నాయకుడు పోట్ల నాగేశ్వర రావు టీఆర్ఎస్ పార్టీని వీడనున్నట్లు ప్రకటించాడు.త్వరలో ఏఐసిసి ఉపాద్యక్షుడు రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ లో చేరనున్నట్లు తెలిపాడు. అంతే కాకుండా అధికార టీఆర్ఎస్ ప్రభుత్వం, సీఎం పై తీవ్ర విమర్శలు చేశారు.  
ఎన్నో ఆశలు, ఆశయాలతో ఏర్పడిన తెలంగాణ ఓ నియంత పాలనలోకి పోయి నాశనమైపోయిందని విమర్శించారు. అసలు సెక్రటేరియట్ కు కూడా రాకుండా పాలన చేసే సీఎం ను తానెక్కడా చూడలేదన్నారు. 35 ఏళ్ల తన రాజకీయ జీవితంలో ఇంత  దౌర్బాగ్య పాలనను ఎప్పుడూ చూడలేదన్నారు.  ఈ నియంతల పార్టీలో ఇమడలేకే కాంగ్రెస్ గూటికి చేరుతున్నట్లు ప్రకటించాడు పోట్ల.
ఇంతకు ముందే రేవంత్ రెడ్డి తో చర్చలు జరిపిన పోట్ల, అతడితో పాటే డిల్లీలో కాంగ్రెస్ లో చేరతాడనే ప్రచారం జరిగింది. కానీ ఏమైందేమో గానీ అప్పుడు చేరలేదు. అనంతరం అతడి సొంత జిల్లా ఖమ్మంకు చెందిన సీనియర్ రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరితో చర్చలు జరిపారు. ఆమె ప్రోత్పాహంతోనే పార్టీలో చేరుతున్నట్లు పోట్ల తెలిపాడు. అయితే అతడు కాంగ్రెస్ పార్టీ జిల్లాకు చెందిన కీలక పదవి అప్పగించే అవకాశం ఉందని తెలుస్తోంది.