టాప్ 5 క్రైమ్ స్టోరీస్

top 5 crime stories in telangana
Highlights

  • తెలంగాణ క్రైమ్ స్టోరీస్
  • 2017 లో టాప్ 5

1. ఈ సంవత్సరం అత్యంత వివాదాస్పదంగా మారిన కేసు కుకునూరుపల్లి ఎస్సై ప్రభాకర్ రెడ్డి, బ్యూటీషియన్ శిరీష ల ఆత్మహత్య లు. ఈ కేసు రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. అంతకు ముందు కొందరు పోలీసు అధికారుల ఆత్మహత్యలకు ఉన్నతాధికారుల వేధింపులే కారణమని వారి కుటుంబసభ్యులు ఆరోపిస్తున్న సమయంలో ఈ ఎస్సై ఆత్మహత్య మరింత దుమారాన్ని రేపింది.  అయితే ఈ ఎస్సై ఆత్మహత్య కు, హైదరాబాద్ లో అంతకు మందురోజు జరిగిన బ్యూటీషియన్ శిరీష ఆత్మహత్యకు సంభందమున్నట్లు పోలీసుల విచారణలో తేలడంతో ఈ వ్యవహారం కొత్త మలుపు తిరిగింది.  

ఇందుకు సంభందించిన వివరాల్లోకి వెళితే రాజీవ్ అనే యువకుడు శిరీష అనే వివాహితతో పాటు తేజస్విని అనే యువతితో సన్నిహితంగా ఉండేవాడు. అయితే రాజీవ్ కోసం శిరీష, తేజస్వినిల మద్య గొడవ జరిగింది. ఈ వ్యవహారం పోలీసుల దాకా వెళ్లింది. అయితే ఇక్కడే రాజీవ్ స్నేహితుడు శ్రావణ్ రంగప్రవేశం చేసి తన క్లాస్‌మేట్ అయిన కుకునూర్‌పల్లి ఎస్సై ప్రభాకర్‌రెడ్డి వద్దకు ఈ పంచాయితీ తీసుకెళ్లాడు. ఆ తర్వాత జరిగిన పరిణామాలతో శిరీష ఆత్మహత్య చేసుకోవడం, అందులో తాను ఇరుక్కుంటానని భావించి ఎస్సై కూడా సర్వీస్ రివాల్వర్ తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ  ఆత్మహత్య ల వ్యవహారం రాష్ట్రంలో తీవ్ర సంచలనం సృష్టించింది.

2. ఆడపిల్ల పుట్టిందన్న కారణంతో భర్త చేతిలో చిత్రహింసలకు గురై న్యాయం కోసం అతడి ఇంటిమందు దీక్ష చేపట్టిన సంగీత వ్యవహారం రాష్ట్రంలో సంచలనం సృష్టించింది.  కట్టుకున్న భార్యను వదిలేసి మరో మహిళను వివాహం చేసుకోవడమే కాకుండా ఇదేమిటని ప్రశ్నించిన భార్య సంగీతను టీఆర్ఎస్ యూత్ లీడర్ శ్రీనివాస్ రెడ్డి చితకబాదాడు. అతడు ఆమెను కొడుతున్న వీడియో సోషల్ మీడియాకెక్కడం, అక్కడది వైరల్ గా మారడంతో తీవ్ర వివాదం రేగింది. దీంతో పోలీసులు శ్రీనివాస్ రెడ్డిని అరెస్ట్ చేశారు. 

ఆ తర్వాత భార్య సంగీత తనకు తన కూతురికి న్యాయం చేయాలంటూ బోడుప్పల్ లోని భర్త ఇంటిముందు దీక్షకు దిగింది. దీంతో స్థానిక ఎంపి మల్లారెడ్డి, ఎమ్మెల్యేలు ఆమెకు సర్ధిచెప్పడానికి ప్రత్నించినా దీక్షవిరమించలేదు. తనకు అత్తామామల నుంచి కానీ, భర్త నుంచి కానీ స్పష్టమైన హామీ వస్తేనే దీక్షవిరమిస్తానని బీష్మించుకు కూర్చుంది. ఇప్పటికీ సంగీత దీక్ష ఇంకా కొనసాగుతూనే ఉంది.

3. హైదరాబాద్ లో అమ్మాయిలను వేధిస్తూ అడ్డంగా దొరికిపోయిన జీహెచ్ఎంసీ టీఆర్ఎస్ కార్పొరేటర్ కొడుకు అభిషేక్ గౌడ్‌ వ్యవహారం కూడా ఈ సంవత్సరం సంచలనంగా మారింది. అతడి చేతిలో వేధింపబడ్డ యువతులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సీసీఎస్ పోలీసులు అతడిని అరెస్టు చేశారు. సోషల్ మీడియాలో అభిషేక్ పలువురు అమ్మాయిలను అసభ్య సందేశాలతో వేధించినట్లు పోలీసులు కూడా గుర్తించారు. అయితే ఆ కేసులో బెయిల్ పై విడుదలై వచ్చాక కూడా మళ్లీ వేధింపులకు పాల్పడ్డాడు. దీంతో మరోసారి అరెస్టయ్యాడు. ఇలా మల్కాజ్‌ గిరికి టీఆర్‌ఎస్‌ కార్పొరేటర్‌  జగదీశ్వర్ గౌడ్ తనయుడు అభిషేక్‌ గౌడ్‌ కేసు సంచలనంగా మారింది.  

4. హాస్యనటుడు విజయ్ సాయి ఆత్మహత్య కూడా ఆ సంవత్సరం, ఇప్పటికి సంచలనం సృష్టిస్తున్న కేసు.   ఆత్మహత్యకు ముందు విజయ్ సెల్ఫీ వీడియోను రికార్డ్ చేశారు.  ఈ సెల్ఫీ వీడియోలో తన చావుకు కారణం తన భార్య వనిత, శశిధర్, అలాగే లాయర్ శ్రీనివాసరావు కారణమని తెలిపాడు. వీరి వేధింపులతోనే  ఆత్మహత్య చేసుకుంటున్నానని వీడియో తెలిపాడు. అయితే అతడి భార్య వనిత మాత్రం అతడి ఆత్మహత్యకు తల్లిదండ్రులే కారణమని చెబుతోంది. అలాగే విజయ్ అందరూ అనుకున్నట్లు మంచివాడు కాదంటూ అతడికి వేరే అమ్మాయిలతో సంభందాలున్నట్లు ఫోటోలతో సహా మైటపెట్టింది. ఇలా ఈ ఆత్మహత్య కేసు అనేక మలుపులు తిరిగుతోంది.

5. తానే ప్లాన్ చేసుకుని కిరాయి హంతకుల చేత కాల్పులు జరిపించుకుని నాటకమాడి పోలీసులకు అడ్డంగా దొరికిపోయాడు మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ త‌న‌యుడు  విక్రమ్ గౌడ్. తాను తవ్వుకున్న గోతిలో తానే పడ్డట్లయింది ఈ కేసులో విక్రమ్ పరిస్థితి. అప్పుల బాధ నుంచి తప్పించుకోవాలని కిరాయి హంతకులకు సుపారి ఇచ్చి మరీ కాల్పులు జరిపించుకున్నాడు విక్నమ్ గౌడ్. అయితే ఈ విషయం పోలీసుల విచారణలో బైటపడి కటకటాల పాలయ్యాడు. ఇలా సమస్యలు పరిష్కారమౌతాయని భావించి మరిన్ని సమస్యలను కొనితెచ్చుకున్నాడు విక్రమ్ గౌడ్.

 

loader