వనపర్తి జిల్లా అడ్డాకుల మండలం కందూరులో విషాదం చోటుచేసుకుంది. జాతర సందర్భంగా దైవదర్శనానికి వెళ్లిన ముగ్గురు యువకులు కోనేరులో మునిగి మృత్యువాత పడ్డారు. వీరంతా ఒకే కుటుంబానికి చెందినవారు కావడంతో ఆ కుటుంబసభ్యుల రోదనలు ప్రమాదస్థలంలో మిన్నంటాయి. ఈ ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. 

మహబూబ్ నగర్ కు చెందిన ఓ కుటుంబం కందుకూరులోని శ్రీరామలింగేశ్వరస్వామి జాతరకు వెళ్లారు. అయితే దైవదర్శనం కోసం స్పానాలు చేయడానికి కోనేటి స్నానానికి వెళ్లారు. అయితే  స్నానానికి దిగిన రవికుమార్, పవన్‌కుమార్, ఆంజనేయులు అను ముగ్గురు సోదరులు కొనేరు లోతు తెలుసుకోకుండా ముందుకువెళ్లారు. ఈ క్రమంలో బాగా లోతులోకి ఒకరి వెంట ఒకరు వెళ్లి ప్రమాదానికి గురయ్యారు. నీటిలో మునిగి ఊపిరాడక ముగ్గురు సోదరులు ప్రాణాలు విడిచారు. సరదాగా గడపడానికి వచ్చిన ఒకే కుటుంబానికి చెందిన యువకులు ఇలా ప్రమాదానికి గురై మరణించడంతో ఆ కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

దీంతో సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు స్థానికుల సాయంతో మృతదేహాలకోసం గాలిస్తున్నారు. ఇప్పటివరకు రవికుమార్‌, పవన్‌కుమార్‌ మృతదేహాలు లభించగా, ఆంజనేయులు మృతదేహం కోసం ఇంకా గాలింపు చర్యలు చేపడుతున్నారు.