తెలంగాణలో ఇవాళ జరిగిన  పదో తరగతి ఇంగ్లీష్ ప్రశ్నాపత్రం లీకేజి వ్యవహారం తీవ్ర కలకలం సృష్టిస్తోంది. విద్యార్థుల భవిష్యత్ తో ఆడుకుంటూ  కొందరు దళారులు ఈ లీకేజీకి  పాల్పడినట్లు పోలీసులు, విద్యాశాఖ అధికారులు గుర్తించారు. ఇప్పటికే ఈ లీకేజీ జరిగనట్లు గుర్తించిన పరిక్షా కేంద్రాల్లోని ఉపాధ్యాయులు, అధికారులపై విద్యాశాఖ చర్యలను ప్రారంభించింది. ఆదిలాబాద్ జిల్లాతో పాటు మహబూబ్ నగర్ జిల్లాలోని కొన్ని పరిక్షా కేంద్రాల్లో  ప్రశ్నాపత్రాలు వాట్సాప్ ద్వారా బైటికి వచ్చినట్లు అధికారులు గుర్తించారు. 

ఆదిలాబాద్ జిల్లా మరికల్ మండల బాలికల ఉన్నత పాఠశాలలో ఇవాళ్టి ఇంగ్లీష్ ప్రశ్నాపత్రం లీకైనట్లు అధికారులు గుర్తించారు. ప్రశ్నాపత్రాన్ని సెల్ ఫోన్ లో ఫోటో తీసుకున్నవెంకటయ్య అనే ఇన్విజిలేటర్ దీన్ని గౌతమ్, ప్రతిభా మోడల్ స్కూళ్లకు వాట్సాప్ ద్వారా పంపించినట్లు సమాచారం. దీంతో ఇతడితో పాటు ఇందులో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఎగ్జామ్ సెంటర్ లోని వారందరిని విదుల్లోంచి తొలగిస్తున్నట్లు విద్యాశాఖ అధికారులు తెలిపారు. అలాగే ఛీప్ సూపరిండెంట్, డీఈవో, ఇన్విజిలేటర్, సిట్టింగ్ స్వాడ్ లపై కేసు నమోదు చేయాలని ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ ఆదేశించారు. పేపర్ లీకేజీలో పాత్ర వున్న వారిపై క్రిమినల్ కేసులు కూడా నమోదుచేయనున్నట్లు సమాచారం.