తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కుతున్నాయి. సినీనటుడు, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ చేసిన తాజా ప్రకటనతో రాజకీయాల్లో కలకలం మొదలైంది. ఇప్పటికే ఏపిలో వైసిపి అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర మొదలుపెట్టి మూడున్నర మాసాలైంది. దాదాపు వెయ్యి కిలోమీటర్లు నడిచారు. తన పాదయాత్రలో చంద్రబాబునాయుడును వ్యక్తిగతంగానే కాకుండా ప్రభుత్వ అవినీతిని, అసమర్ధతపై శక్తివంచన లేకుండా విరుచుకుపడుతున్నారు.

అదే సమయంలో చంద్రబాబు కూడా జన్మభూమి కార్యక్రమం పేరుతో పార్టీ శ్రేణులు మొత్తాన్ని దాదాపు 10 రోజులపాటు జనాల్లోనే ఉంచారు. పేరుకే ప్రభుత్వ కార్యక్రమమైనా మొత్తం వ్యవహారం పార్టీ కార్యక్రమంలాగే సాగింది. రాబోయే ఎన్నికల ప్రచారానికి జన్మభూమి కార్యక్రమాన్ని ప్రచారంగా చంద్రబాబు మలుచుకున్నారు. దాంతో ఒకవైపు జగన్ పాదయాత్ర, మరోవైపు చంద్రబాబు జన్మభూమి కార్యక్రమంతో రాష్ట్రం హోరెత్తిపోయింది. దానికితోడు మిత్రపక్షం భారతీయ జనతా పార్టీ కూడా అవకాశం దొరికినపుడల్లా ఏదో పేరుతో పార్టీ కార్యక్రమాలను చేస్తూనే ఉంది.

ఇటువంటి నేపధ్యంలోనే జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ హటాత్తుగా తన అప్రతిహత ‘రాజకీయయాత్ర’ను ప్రకటించారు. అయితే, అందులో స్పష్టత లేదు. కరీంనగర్ జిల్లాలోని కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయం నుండి రాజకీయయాత్రను ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. తాన రాజకీయ యాత్ర ఎప్పటి నుండి ప్రారంభమవుతుంది? యాత్ర ఏ విధంగా సాగుతుంది? అసలు కొండగట్టు ఆలయంలో ఎప్పుడు పూజలు చేస్తారన్నది లేదు? సరే, పూజలు ఎప్పుడు చేసినా, యాత్ర స్వరూపం ఎలాగున్నా ఒకసారి పవన్ జనాల్లోకంటూ వస్తే రాజకీయాలు వేడెక్కిపోవటం మాత్రం ఖాయం.

ఒకవైపు సినీ విమర్శకుడు కత్తి మహేష్ పదేపదే పవన్ ను లక్ష్యం చేసుకుని విమర్శలు చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. పవన్ అభిమానులు కత్తిపై దాడి చేశారు. దాంతో పవన్-కత్తి వివాదం కాస్త సామాజికవర్గ సమస్యగా మారిపోయింది. ఈ నేపధ్యంలోనే పవన్ తన రాజకీయయాత్రను ప్రకటించటం అందులోనూ తెలంగాణాలోని కరీంనగర్ జిల్లా నుండి ప్రారంభిస్తానని చెప్పటంతో రాజకీయాల్లో ఒక్కసారిగా వేడి పెరిగిపోయింది.