పొట్టకూటి కోసం గల్ఫ్ కు వెళ్లిన తెలుగువారు అక్కడ దాడులకు గురవుతున్నారు. తాజాగా ఓ కంపెనీలో పనిచేస్తున్న తెలుగు యువకుడు మహేష్ దాడికి గురయ్యాడు. దీంతో అక్కడున్న దాదాపు 200 మంది తెలుగు రాష్ట్రాలకు చెందిన కార్మికులు కంపెనీ ఎదుట ఆందోళనకు దిగారు.  

ఈ దాడికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. తెలంగాణ కు చెందిన మహేష్ అనే  యువకుడు ఉపాధి కోసం యెమెన్ కు వెళ్లి ఓ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. అయితే ఇతడు మూడు రోజులుగా డ్యూటీకి వెళ్లడం లేదు. దీంతో  కంపెనీకి చెప్పాపెట్టకుండా ఎందుకు రావడం లేదంటూ మేనేజర్లు మాజిద్, శివ ,హర్షిద్ అనే ముగ్గురు  అధికారులు దాడికి దిగారు.  మహేష్ ను ఓ రూంలోకి తీసుకుళ్లి బంధించి మరీ చితకబాదారు. ఈ దాడిని అడ్డుకోడానికి ప్రయత్నించిన లక్ష్మణ్, మణికంఠ అనే మరో  ఇద్దరు తెలుగువారిపై కూడా వీరు చేయిచేసుకున్నారు. 

ఈ దాడితో తీవ్ర మనస్థాపానికి గురైన మహేష్ బ్లేడ్ తో చేతి మణికట్టు వద్ద కోసుకుని ఆత్మహత్యకు ప్రయత్నించాడు. దీన్ని గమనించిన అతడి తోటి కార్మికులు యువకుడిని హాస్పత్రికి తరలిస్తుండగా ఇదే మేనేజర్లు అడ్డుకున్నారు. దీంతో తెలుగు కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేయడంతో కాస్త వెనక్కి తగ్గారు. చివరకు  ఎలాగైతేనేం బాధితుడు మహేష్ ని ఆస్పత్రికి చేర్చి చికిత్స అందిస్తున్నారు.

 ఈ దాడికి పాల్పడిన అధికారులే పోలీసులకు తప్పుడు సమాచారం అందించి వారిచేత మళ్లీ తమనే కొట్టించారని తెలుగువారు ఆవేధన వ్యక్తం చేస్తున్నారు. దీంతో అక్కడున్న దాదాపు 200 మంది తెలుగు వారు కంపెనీ ఎదుట ఆందోళన చేపట్టారు. ఇకనుంచి తామెవరమూ విధులకు రామని, తమని ఇండియాకి పంపించాలని డిమాండ్ చేస్తున్నారు.

 

వీడియో