తెలంగాణలో మరో నిరుద్యోగి ఆత్మహత్య

First Published 4, Dec 2017, 4:13 PM IST
Telangana job aspirant commits suicide out of frustration
Highlights
  • తెలంగాణలో మరో నిరుద్యోగి ఆత్మహత్య 
  • మురళి ఆత్మహత్య మరువక ముందే నిర్మల్ జిల్లాలో మరో ఘటన
  • ఇంట్లో దూలానికి ఉరేసుకుని భూపేశ్ ఆత్మహత్య

 తెలంగాణ రాష్ట్రంలో గడిచిన 40 నెలల కాలంలో ఒక్క టీచర్ పోస్టు కూడా భర్తీ చేయకపోవడంతో నిరుద్యోగ టీచర్ అభ్యర్థులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. నిర్మల్ జిల్లాలో మరో విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నారు. ఉద్యోగం రావడంలేదని, నోటిఫికేషన్లు జారీ చేయడంలో ప్రభుత్వ చిత్తశుద్ధి లోపించిందన్న బాధతో నిర్మల్ జిల్లాకు చెందిన భూమేష్ (35) ఆత్మహత్య చేసుకున్నాడు. ఇంట్లోని దూలానికి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. భూమేష్ ఎమ్మెస్సీ, బిఇడి చదివాడు. డిఎస్సీ వేస్తే టీచర్ పోస్టు సంపాదించాలన్న ఆశతో ఉన్న భూమేష్ ఆశలు సర్కారు తీరు వల్ల అడియాశలైపోయాయని చెబుతున్నారు.

బిఇడి, డిఇడి చేసి టెట్ పాసై కండ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తున్న టీచర్ అభ్యర్థులకు తెలంగాణ సర్కారు చేదు వార్తలే అందిస్తున్నది. ఇదిగో డిఎస్సీ అదిగో డిఎస్సీ అంటూ కాలయాపన చేసింది. 40 నెలల కాలంలో ఒక్క టీచర్ పోస్టు కూడా భర్తీ చేయకపోవడంతో నిరుద్యోగులు సర్కారుపై రగిలిపోతున్నారు.

తెలంగాణ ఉద్యమకాలంలో తెలంగాణ వస్తే ఉద్యోగాలు వస్తాయన్న ఆశతో విద్యార్థిలోకం ఉద్యమంలో కదం తొక్కింది. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత ఉద్యోగాల జాడే లేదని నిరుద్యోగులు మండిపడుతున్నారు. డిఎస్సీ వేయకపోగా వేసిన టిఆర్టి కూడా కొర్రీలతో వేయడంతో హైకోర్టు కొట్టేసింది. దీంతో నిరుద్యోగులు ఇక టీచర్ పోస్టులు భర్తీ చేయరేమో అన్న ఆందోళనతో కొట్టుమిట్టాడుతున్నారు.

loader