తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ కు ఇవాంక ట్రంప్ తో మరోసారి భేటీ కానున్నారా? అంటే అధికారుల నుంచి అవుననే సమాధానం వస్తోంది. అయితే ఇప్పటికే ఇవాంక అమెరికాకు వెళ్లిపోయారు కదా మరి భేటీ ఎలా జరుగుతుందని అనుకుంటున్నారా. అయితే ఈ స్టోరి చదవండి.

జీఈఎస్ సదస్సులో పాల్గొనడానికి హైదరాబాద్ కు విచ్చేసిన అమెరికా అధ్యక్షుడి కూతురు, సలహాధారు ఇవాంక కేటీఆర్ అమెరికాకు ఆహ్వానించిన విషయం తెలిసిందే. ఆమె, ఆహ్వానంతో పాటు అధికారికి కార్యక్రమాల నిమిత్తం ఐటీ మంత్రి అమెరికాకు వెళ్లనున్నారు. ఈ పర్యటనలోనే ఆయన ఇవాంకతో భేటీ అవుతారని ఐటీ సెక్రటరీ జయేష్ రంజన్ తెలిపారు. అదే విధంగా కేటీఆర్ అమెరికా అధికారిక పర్యటన వివరాలను కూడా తెలియజేశారు. 

కేటీఆర్ 2018 ఫిబ్రవరి 12 ఓ ఐటీ బృందంతో కలిసి అమెరికాలో పర్యటించనున్నారు.అక్కడి హార్వర్డ్ యూనివర్సిటీలో జరిగే ఓ కార్యక్రమానికి మంత్రి హజరుకానున్నారు. అలాగే ఈ పర్యటనలోనే మంత్రి కేటీఆర్ ఇవాంక తో భేటీ అవనున్నారు. యూఎస్ వచ్చినపుడు తనను కలవాలన్న ఇవాంక ఆహ్వానం మేరకు ఆమెతో మర్యాదపూర్వక భేటీ సాగనుందని జయేష్ రంజన్ తెలిపారు. 

జీఈఎస్ సదస్సు నిర్వహణ పట్ల ఇవాంక సంతోషం వ్యక్తం చేసినట్లు తెలిపారు. ఈ సదస్సు వల్ల భారత్, అమెరికా సంబందాలు మెరుగుపడనున్నాయని ఇవాంక తెలిపిసట్లు జయేష్ మీడియాకు వెల్లడించారు. రెండు రోజుల పాటు జరిగిన ఇవాంక పర్యటన వల్ల హైదరాబాద్ ప్రపంచ దేశాల దృష్టిలో పడిందని ఆయన అన్నారు. ఈ సదస్సు ఇంత విజయవంతంగా నిర్వహించిన ఘనత తెలంగాణ ప్రభుత్వానికే దక్కుతుందని అన్నారు. ఇక పిబ్రవరిలో జరిగే ఇవాంక, కేటీఆర్ ల భేటీతో అమెరికాతో తెలంగాణ సంభందాలు మెరుగుపడతాయని జయేష్ అభిప్రాయపడ్డారు.