సూర్యాపేట జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. రాజకీయంగా ఏర్పడిన వైరం ఓ అధికారపార్టీ మండలాధ్యక్షుడు, ఎంపిటీసిగా వున్న అతడి భార్యపై హత్యాయత్నానికి కారణమైంది. ఈ ఘటన చింతలపాలెం మండలంలో చోటుచేసుకుంది.

ఈ దాడికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.  టీఆర్ఎస్ చింతలపాలెం మండల అధ్యక్షుడిగా లకావత్ రామారావు పనిచేస్తున్నాడు. అతడి భార్య సుభద్ర తమ్మారం ఎంపిటీసిగా పనిచేస్తోంది. అయితే ఈ దంపతులపై జరిగిన దాడి జిల్లాలో తీవ్ర కలకలం రేపింది. వారు నివసిస్తున్న ఇంట్లోకి కత్తులతో ప్రవేశించిన దుండగుడు రామారావు లక్ష్యంగా చేసుకుని దాడికి దిగాడు. ఢర్తపై జరుగుతున్న దాడిని అడ్డుకునే క్రమంలో భార్య సుభద్ర కు కూడా గాయాలయ్యాయి. ఈ దాడిలో తీవ్రగాయాలపాలైన భార్యాభర్తలు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.  

ఈ హత్యాయత్నంపై సమచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.  దాడికి పాల్పడ్డట్లుగా అనుమానిస్తున్న పీక్లానాయక్ తండాకు చెందిన ఓ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతడ్ని విచారించి ఈ దాడికి గల కారణాలను తెలియజేస్తామని పోలీసులు చెబుతున్నారు. ఈ టీఆర్ఎస్ పార్టీకి చెందిన దంపతులపై దాడికి రాజకీయ కక్షలే కారణమై ఉంటుందని అనుమానిస్తున్నారు.