తెలంగాణ సీఎం కేసీఆర్ లాగే గవర్నర్ నరసింహన్ కూడా నియంత లాగ వ్యవహరిస్తున్నాడని కాంగ్రెస్ నాయకుడు, మాజీ మంత్రి సర్వే సత్యనారాయణ మండిపడ్డారు. వీరిద్దరు దళిత వ్యతిరేకులేనని అన్నారు. ఇవాళ మరో మాజీ ఎంపి సిరిసిల్ల రాజయ్యతో కలిసి సర్వే సత్యనారాయణ చంచల్ గూడ జైల్లో మంద కృష్ణ మాదిగను పరామర్శించారు. ఈ సందర్భంగా సర్వే జైలు బైట మీడియాతో మాట్లాడుతూ.. న్యాయబద్ధమైన ఎస్సి వర్గీకరణ కోసం పోరాడుతున్న మంద క్రిష్ణ మాదిగ ను జైల్లో పెట్టడం అప్రజాస్వామికం అన్నారు. మంద కృష్ణను జైల్లో పెట్టినంత మాత్రాన వర్గీకరణ ఉద్యమం ఆగదన్నారు. త్వరలో కాంగ్రెస్ పార్టీ ఎస్సి వర్గీకరణ కొసం కార్యచరణ ప్రకటిస్తుందన్నారు.   కేసీఆర్ అప్రజాస్వామిక పాలనకు వంత పాడుతున్న గవర్నర్ ను బర్తరఫ్ చేయాలనీ ఆయన డిమాండ్ చేశారు.