కళాశాలలో లెక్చరర్ వేధింపులు తట్టుకోలేక ఓ విద్యార్థిని ఆత్మహత్యాయత్నం చేసుకున్న దుర్ఘటన భద్రాచలంలో చోటుచేసుకుంది. చదువు పేరుతో లెక్చరర్ అవమానించడంతో తీవ్ర మనస్థాపానికి గురైన యువతి పురుగుల మందు తాగి ఆత్మహత్య కు పాల్పడింది.

వివరాల్లోకి వెళితే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం లింగాలపల్లికి చెందిన చాప కృష్ణ ప్రియాంక భద్రాచలం పట్టణంలో డిగ్రీ చదువుతోంది. మదర్ థెరిస్సా డిగ్రీ కళాశాలలో ప్రియాంక బీఎస్సీ రెండవ సంవత్సరం చదువుతోంది. అయితే కాలేజీలో ఫిజిక్స్ లెక్చరర్ నర్సింహారావు తరచూ ప్రియాంకను వేధించేవాడని తోటి విద్యార్థులు చెబుతున్నారు. అయితే కాలేజీకి సెలవులు ఉండటంతో ప్రియాంక స్వగ్రామానికి వెళ్లింది. అక్కడ లెక్చరర్ వేధింపులను మర్చిపోలేక తీవ్ర మనోవేదనతో డిప్రేషన్ కు లోనైంది.  ఇదే ఆందోళనతో ప్రియాంక పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. దీంతో తల్లిదండ్రులు వెంటనే ఆమెను సత్తుపల్లిలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ కు తరలించారు. ఇక్కడ చికిత్స పొందుతూ ఆమె ఇవాళ మృతిచెందింది.

అయితే ప్రియాంక మృతితో తీవ్ర ఆగ్రహానికి లోనైన తల్లిదండ్రులు, భందువులు మృతదేహాన్ని భద్రాచలంలోని కాలేజీ వద్దకు తరలించడానికి ప్రయత్నిస్తున్నారు. దీంతో అక్కడ విద్వంసం జరిగే అవకాశం ఉందంటూ పోలీసులు వారిని మార్గ మద్యలోనే అడ్డకున్నారు.అయితే పోలీసుల నుంచి తప్పించుకొని మృతదేహంతో భాధితులు భద్రాచలం వైపు  భయలుదేరారు.

తమ కూతురు కృష్ణ ప్రియాంక  లెక్చరర్ వేధింపులు తాళలేక ఆత్మహత్య కు పాల్పడిందని  తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.తమ కూతురిని పొట్టనపెట్టుకున్న ఉపాద్యాయుడికి శిక్ష పడి తమకు న్యాయం జరిగే వరకు తమ ఆందోళనను ఆపమని స్పష్టం చేస్తున్నారు.