గుంటూరులోని నాగార్జునా యూనివర్సిటీ ప్రాంగణంలో జరుగుతున్న జనసేన పార్టీ ఆవిర్భావ మహాసభకు పవన్ అభిమానులు, జనసేన కార్యకర్తలు భారీగా తరలివచ్చారు.  కార్యకర్తలు అదుపుతప్పి భారీకేడ్లను తోసుకుంటూ సభావేధిక వద్దకు చొచ్చుకుని రావడానికి ప్రయత్నించారు. దీంతో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో పదిమంది జనసేన కార్యకర్తలు, పోలీసులు గాయపడ్డారు. తొక్కిసలాటను అదుపు చేయడానికి పోలీసులు ఎంత ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. అభిమానులు భారీకేడ్లను తోసుకుంటే తండోపతండాలుగా వస్తుండటంతో వారిని ఆపలేకపోయారు. వీరిని నిలువరించేందుకు ప్రైవేట్ సెక్యూరిటీ సిబ్బంది కూడా తీవ్రంగా శ్రమిస్తున్నారు. కార్యకర్తలను అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు,సెక్యూరిటీ సిబ్బంది స్వల్ప లాఠీచార్జ్ చేశారు.

 జనసేన కార్యకర్తల ధాటికి బ్యారికేడ్లు ధ్వంసమయ్యాయి. పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినప్పటికి వేదిక వద్దకు చేరుకుని జనసేనాని పవన్ కళ్యాణ్ ను దగ్గరనుంచి చూడాలని అభిమానులు ఆశించడంతో ఈ తొక్కిసలాట జరిగింది. గాయపడిన కార్మకర్తలను, పోలీసులకు ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. 

కాసేపట్లో జనసేన అధినేత పవన్ కల్యాణ్ సభా వేదిక వద్దకు రానున్నారు. ఈ సభకు జనసేన కార్యకర్తలతో పాటు భారీగా చేరుకున్నఅభిమానులనుద్దేశించి పవన్ కళ్యాణ్ ప్రసంగించనున్నారు. అలాగే జనసేన పార్టీ భవిస్యత్ కార్యాచరణ, ఎన్నికల ప్రణాలిక గురించి కూడా వెల్లడించనున్నట్లు సమాచారం.