అభినయ శ్రీ ‘వాణిశ్రీ’
- శ్రీ కృష్ణ తులాభారంలో సత్యభామ గా పొగరు చూపించింది
- వాణిశ్రీ పుట్టిన రోజు నేడు.
అభినయానికి పెట్టింది పేరు ‘వాణిశ్రీ’. మొదట చెల్లులి పాత్రతో చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టిన వాణిశ్రీ..
. మరికొన్ని చిత్రాలలో ఆదర్శ గృహిణిగా నటించింది.. సెకండ్ ఇన్నింగ్స్ లో మంచి తల్లిగా.. అత్తగా కూడా రాణించింది. ఆ కళా ప్రపూర్ణ పుట్టిన రోజు నేడు. ఈ సందర్భంగా ఆమె జీవిత విశేషాలను తెలుసుకుందామా...
వాణిశ్రీ.. 1948వ సంవత్సరం ఆగస్టు 3వ తేదీన నెల్లూరులో జన్మించారు. 1960 నుంచి 1970 వరకు అంటే దాదాపు పది సంవత్సరాల పాటు తెలుగు చిత్ర సీమను ఏలారని చెప్పుకోవచ్చు. ఒక తెలుగులోనే కాకుండా తమిళ, కన్నడ, మళయాళ చిత్రాలలో కూడా ఆమె తన ప్రతిభను చాటారు. అంతే కాదు.. వాణి శ్రీ అనగానే అందరికీ గుర్తుకు వచ్చేది ఆమె హెయిర్ స్టైల్. అప్పటి వరకు ఉన్న నటులెవరూ అలాంటి హెయిర్ స్టైల్ ప్రయత్నించలేదు. కానీ వాణిశ్రీ మాత్రం పెద్ద కొప్పుతో కనిపించేది. అది ఆమెకు మాత్రమే సూట్ అవుతుందేమో అని అనిపించేది.
వాణిశ్రీ చిన్న వయసులో మద్రాసు ఆంధ్ర మహిళాసభలో భరత నాట్యం నేర్చుకున్నారు. ఒకసారి సభ వార్షికోత్సవ కార్యక్రమానికి కన్నడ డైరెక్టర్ హుణుసూరు కృష్ణమూర్తి వచ్చారు. ఆ వేడుకల్లో ఆమె నాట్యంచూసి ‘ఈ అమ్మాయి సావిత్రి లా ఉందే? సినిమాల్లో నటిస్తుందా?’ అని అడిగారట. అందుకు వాణిశ్రీ వాళ్ల అమ్మ ఒప్పుకోలేదట..అయితే.. వాణిశ్రీ ఒప్పిం చి మరి తొలిసారి కన్నడ సినిమాలో నటించారు. ‘నాదీ ఆడజన్మే’ సినిమా తీసిన కంపెనీ పేరు.. శ్రీవాణి ఫిలిమ్స్. వాళ్లే ఆమెకు వాణిశ్రీ అని పెట్టారట.
ఆమె చీరకట్టు విధానం కూడా చాలా కొత్తగా ఉంటుంది. ఒకసారి ఆమె చీర కట్టు చూస్తే.. రాజకుటుంబం నుంచి వచ్చిన వ్యక్తిలా ఉంటావు అని కృష్ణం రాజు పొగిడారట. అనాటి నటులు.. ఎన్టీఆర్, ఏఎన్ ఆర్, కృష్ణంరాజు, శోభనబాబు వంటి నటులతో ఎన్నో మంచి హిట్ చిత్రాలలో నటించారు. వారి సరసన కథానాయకగా నటించిన ఆమె.. ఆ తర్వాత చిరంజీవి, వినోద్ కుమార్ వంటి నటులతో అత్త పాత్రల్లో నటించి మెప్పించారు.
దశాబ్ధకాలం పాటు కథనాయకగా రాణించిన ఆమె.. తర్వాత వివాహం చేసుకొని సినిమాలకు కొంతకాలం స్వస్తి చెప్పారు. ఆమె వివాహం చేసుకుంది వాళ్ల ఫ్యామిలీ డాక్టర్ నే. వాణిశ్రీ కి ఒక కుమారుడు.. ఒక కుమార్తె ఉన్నారు. వారు మాత్రం సినిమాల్లోకి రాలేదు.
మరోసారి కళా ప్రపూర్ణ వాణిశ్రీ .. ఏసియా నెట్ న్యూస్ తరపు నుంచి జన్మదిన శుభాకాంక్షలు.