ఆంధ్ర ప్రదేశ్ చిత్తూరు జిల్లాలో ఘోర ప్రమాదం సంభవించింది. పలమనేరు మండలంలో ఓ పరిశ్రమలో  డ్రైనేజి సమస్య ఏర్పడటంతో సరిచేయడానికి మ్యాన్ హోల్ లోకి దిగిన ఏడుగురు కార్మికులు మృత్యువాత పడ్డారు.ఇవాళ ఉదయం జరిగిన ఈ ఘటనతో పలమనేరు ప్రాంతంలో విషాద చాయలు అలుముకున్నాయి.

ఈ దుర్ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే... పలమనేరు సమీపంలోని ఓ కోళ్ల ఉత్పత్తి కేంద్రంలో ఇవాళ ఉదయం డ్రైనేజి సమస్య ఏర్పడింది. దీంతో ఈ పరిశ్రమలో పనిచేసే కొందరు కార్మికులు దాన్ని బాగుచేయడానికి ప్రయత్నించారు. అందులో భాగంగా ఓ వ్యక్తి మ్యాన్ హోల్ లోకి దిగి శుభ్రం చేస్తుండగా విషవాయువులు వెలువడి ఊపిరాడక పడిపోయాడు. దీన్ని గమనించిన మరికొందరు కార్మికులు అందులోకి దిగి అతడిని కాపాడటానికి ప్రయత్నించారు. అయితే వారికి కూడా ఊపిరాడక అందులోనే పడిపోయారు. దీంతో అక్కడేవున్న స్థానికులు డ్రైనేజీని పగులగొట్టి అందులో చిక్కుకుపోయిన వారిని బయటకు తీశారు. అయితే అప్పటికే అందులో దిగిన నలుగురు చనిపోయారు. మరో ముగ్గురు కొన ఊపిరితో ఉండగా వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఈ ముగ్గురు కూడా మృతి చెందారు. ఇలా ఈ ప్రమాదంలో మొత్తం ఏడుగురు ప్రాణాలను వదిలారు.

దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు.  డ్రైనేజీలో రసాయన అవశేషాలు కలవడం వల్లనే ఈ ప్రమాదం జరిగి కార్మికులు మరణించి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్నామని, విచారణ అనంతరం ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తామని పోలీసులు తెలిపారు.