బొడ్డుపల్లి శ్రీనివాస్ హత్య కేసును నీరుగార్చేందుకు జిల్లా ఎస్పీ ప్రయత్నిస్తున్నట్లు సంచలన వ్యాఖ్యలు చేశారు కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి. సత్యనారాయణ కథలో మమ అన్నట్లుగా జిల్లా ఎస్పీ ఈ కేసు విచారణను మమ అనిపిస్తున్నాడని ఎద్దేవా చేశారు.  మిర్చీల బండి దగ్గర ఉల్లిపాయల కోసమే ఈ హత్య జరిగిందనడానికి ఎస్పీకి సిగ్గుందా అని విమర్శించారు రేవంత్ రెడ్డి. ఇంత పెద్ద చదువులు చదివి ఐపీఎస్ గా చేరిన ఆయన ఇలా సిగ్గులేకుండా రాజకీయ నాయకులకు కొమ్ముకాస్తూ మాట్లాడటం ఏం బాగాలేదని విమర్శించారు. ఇవాళ నల్గొండలో జరుగుతున్న బొడ్డుపల్లి శ్రీనివాస్ సంతాప సభలో పాల్గొన్న ఆయన ఎస్పీపై, టీఆర్ఎస్ నాయకులపై విరుచుకుపడ్డారు.

 తెలంగాణ రాష్ట్రంలో ప్రజా స్వామ్యం ఉందా అన్న అనుమానం కలుగుతోందని అన్నారు రేవంత్ రెడ్డి. ఎస్సీ వర్గీకరణ కోసం పొరాడుతున్న మందకృష్ణ ను రెండు నెలలు ఈ పోలీసులు   జైళ్లో పెట్టారని అన్నారు. అలాగే  ఉస్మానియాలో నిరుద్యోగి మురళి ఆత్మహత్య చేసుకోవడంతో క్యాంపస్ లోని విద్యార్థులను పరామర్శించడానికి వెళ్లిన ఒంటేరు ప్రతాప్ రెడ్డిని కూడా రెండు నెలలు బైటికి రాకుండా జైలుపాలు చేశారు. మరి ఇంత పెద్ద హత్య చేసిన నిందితులు మాత్రం ఐదురోజుల్లోనే బెయిల్ పై  బైటికి వచ్చారు. ఇందులో వైఫల్యం ఎవరిదని ప్రశ్నించారు రేవంత్ రెడ్డి.  
  
రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ బానిసలుగా బతుకుతున్నారని, వీరు దొర గడీ వద్ద కాపాలా కుక్కలుగా మారిండ్రని అన్నారు రేవంత్ రెడ్డి.  కోర్టులో కేస్ లు వేస్తే కాల్ డేటా బయటికి వచ్చింది కానీ వీరు చిత్తశుద్దితో బయటపెట్టిందేమీ లేదని అన్నారు. పార్టీ ఫిరాయింపును, ఎమ్మెల్యే వీరేశంను వ్యతిరేకించినందుకే శ్రీనును హత్య చేయించారన్నారు. వీరేశంను బట్టలు ఉడదీసి కొడితే హత్య వెనక ఉన్న మంత్రి జగదీశ్వర్ రెడ్డి, ఆయన వెనక వున్న సీఎం చంద్రశేఖర్ రావు బయటకు వస్తారని రేవంత్ రెడ్డి మండిపడ్డారు.

కాంగ్రెస్ కార్యకర్తలు ఐక్యంగా ఉద్యమించి శ్రీనివాస్ కుటుంబానికి అండగా నిలవాలని పిలుపునిచ్చారు రేవంత్ రెడ్డి.