కాంగ్రెస్ పార్టీలో రాహూల్ గాంధి శకం మొదలైంది.
కాంగ్రెస్ పార్టీలో రాహూల్ గాంధి శకం మొదలైంది. రాహూల్ గాంధికి ఏఐసిసి అధ్యక్షునిగా శనివారం ఉదయం పట్టాభిషేకం జరిగింది. ఉదయం ఏఐసిసి కార్యాయలంలో పార్టీలోని అతిరధ మహారధుల సమక్షంలో ఏఐసిసి 7వ అధ్యక్షునిగా బాద్యతలు స్వీకరించారు.
రాహూల్ బాధ్యతల స్వీకణతో గాంధి- నెహ్రూ కుటుంబంలోని ఐదోతరం చేతికి పగ్గాలు వచ్చినట్లైంది. తల్లి సోనియాగాంధి నుండి రాహూల్ బాధ్యతలు తీసుకున్నారు. మొన్ననే జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో రాహూల్ ఏకగ్రీవంగా ఎన్నికైన సంగతి అందరికీ తెలిసిందే. 2007లో ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు. 2013లో రాహూల్ ఏఐసిసికి ఉపాధ్యక్ష పదవి చేపట్టారు.
1970 జూన్ 19వ తేదీన పుట్టారు. ఢిల్లీ, హార్వర్డ్, కేంబ్రిడ్జి విద్యాసంస్ధల్లో చదువుకున్నారు. 2004లో తొలిసారిగా ఉత్తరప్రదేశ్ లోని అమేధి నియోజకవర్గం నుండి ఎంపిగా పోటీ చేసి గెలిచారు. ఈరోజు జరిగిన కార్యక్రమంలో సోనియాగాంధి,
మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్, సోదరి ప్రియాంకా గాంధి, బావ రాబర్ట్ వాధ్రా తదితరులందరూ పాల్గొన్నారు. రాహూల్ పట్టాభిషేకాన్ని దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ నేతలు ఓ పండుగగా చేసుకున్నారు. దేశంలోని కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, పిసిసి అధ్యక్షులు అందరూ పట్టాభిషేక మహోత్సవానికి హాజరయ్యారు.
అక్బర్ రోడ్డులోని అధికారిక కార్యాలయం వద్ద కాంగ్రెస్ నేతల హడావుడి ఓ రేంజిలో సాగుతోంది. పార్టీ కార్యాలయాల్లో పండుగ వాతావరణం కనిపిస్తోంది.
