సామాజిక చిత్రాల దర్శకుడు ఆర్ నారాయణ మూర్తి ప్రతిష్టాత్మక కొమరం భీమ్ జాతీయ  పురస్కారానికి ఎంపికయ్యారు.తెలంగాణ టెలివిజన్  డెవ‌ల‌ప్‌మెంట్ ఫోరమ్, ఆదివాసి సాంసృతిక పరిషత్, గోండ్వానా కల్చరల్ ప్రొటెక్టెన్స్ ఫోర్స్, భారత్ కల్చరల్ అకాడమీ సంయుక్తంగా ప్రతి ఏడాది ఈ అవార్డును అందిస్తుంటుంది. 2017  సంవత్సరానికి గాను ఈ అవార్డుకు సినీ దర్శకుడు, నిర్మాత, నటుడు ఆర్.నారాయణ మూర్తి ని ఎంపిక చేసినట్లుగా అవార్డు కమిటీ చైర్మన్ కె వి రమణ చారి ప్రకటించారు.  
కొమరం భీమ్ వర్ధంతి(అక్టోబర్ 6న) సందర్భంగా ప్రకటించే ఈ అవార్డును గతం లో   కొమరం భీమ్ చిత్రం నిర్మాత, దర్శకుడు అల్లాణి శ్రీధర్, గేయ రచయిత సుద్దాల అశోక్ తేజ లు అందుకున్నారు.   
ఈ నెల చివర్లో జరిగే అవార్డు ప్రదానోత్సవం కార్యక్రమంలో నారాయణమూర్తికి ఈ అవార్డును అందించనున్నారు. అవార్డు కింద  51 వేల రూపాయల  నగదు,   జ్ఞాపిక, ప్రశంస పత్రం అందించనున్నట్లు కన్వీనర్ నాగబాల సురేష్ కుమార్ తెలిపారు. 
కొమరం భీమ్ స్ఫూర్తి తో పలు సినిమాలు నిర్మించిన దర్శకుడు ఆర్ నారాయణ మూర్తి  ప్రజలను చైతన్య వంతులుగా మారుస్తున్నారని రమణాచారి ప్రశంసించారు.   అర్దరాత్రి స్వతంత్రం, అడివి దివిటీలు, లాల్ సలాం,దండోరా, ఎర్ర సైన్యం, చీమల దండు,దళం, చీకటి సూర్యులు, ఊరు మనదిరా, వేగు చుక్కలు, అరణ్యం, ఎర్రోడు, సింగన్న లాంటి పలు చిత్రాలను రూపొందించి కొమరం భీమ్ ఆశయాలకు అనుగునంగా నిర్మించినవే కావున ఆర్ నారాయణ మూర్తి ఈ అవార్డు ఇవ్వడం సమంజసమేనని రమణ చారి అన్నారు.