తాను రోజూ విధులు నిర్వహించే పోలీస్ స్టేషన్ లోనే ఓ కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన సూర్యాపేట జిల్లాలో చోటుచేసుకుంది. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్‌లో దామోదర్‌ రెడ్డి అనే వ్యక్తి హెడ్ కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్నాడు. అయితే రోజూలాగే పొద్దున్నే విధులకు హాజరైన ఇతడు స్టేషన్‌లో ఎవరూ లేని సమయం చూసి తనతో తెచ్చుకున్న పురుగుల మందు తాగి  ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డాడు. అయితే ఇతడు తీవ్ర నొప్పితో ప్రాణాపాయ స్థితిలో ఉండగా గుర్తించిన తోటి సిబ్బంది ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఇతడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. 

కానిస్టేబుల్ దామోదర్ రెడ్డి కొడుకుపై వున్న గృహ హింస కేసు ఉంది. ఈ కేసు విచారణలో బాగంగా  రూరల్‌ ఎస్సై లవకుమార్‌  వారం రోజుల క్రితం దామోదర్ రెడ్డి పై చేయి చేసుకున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే మనస్థాపానికి గురైన దామోదర్‌ ఆత్మహత్య యత్నించి ఉంటాడని బందువులు చెబుతున్నారు.  ఈ ఘటనపై ఉన్నతాధికారులు విచారణ చేపడుతున్నారు.