రాజకీయయాత్రను పవన్ కల్యాణ్ తెలంగాణా నుండే ప్రారంభిస్తున్నారు. సోమవారం ఉదయం కొండగట్టు దేవాలయంలో పూజలు చేసి, కార్యకర్తలతో సమావేశం పెట్టిన తర్వాత యాత్ర మొదలవుతోంది. నాలుగు జిల్లాల్లో తన యాత్ర సాగుతుందని పవన్ కల్యాణ్ మీడియాతో చెప్పారు. ఆదివారం ఉదయం సికింద్రాబాద్ లోని సెయింట్ మేరీస్ చర్చిలో ప్రార్ధనలకు హాజరైన సంరద్భంగా మీడియాతో మాట్లాడుతూ, షెడ్యూల్ ఇంకా ఫైనల్ కాలేదన్నారు. పాదయాత్ర చేయాలా? రోడ్డుషోనా అన్న విషయంలో తనకే స్పష్టత లేదన్నారు. పాదయాత్ర చేయటంకన్నా ప్రజలతో మమేకం కావటం ముఖ్యమన్నారు.

తన యాత్ర షెడ్యూల్ ను ప్రతీ నాలుగు రోజులకు ఒకసారి ప్రకటిస్తానని చెప్పారు. కొండగట్టు నుండే రాజకీయ యాత్ర ప్రారంభించాలని గతంలోనే ఆంజనేయస్వామి ఆలయంలో మొక్కుకున్నట్లు చెప్పారు. అందులో భాగంగానే ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి యాత్ర మొదలుపెడుతున్నట్లు తెలిపారు. ఎక్కడికక్కడ కార్యకర్తలతో సమావేశాలు పెట్టుకుని ముందుకు సాగుతానని పవన్ తెలిపారు.