తెలంగాణ నిరుద్యోగులకు ప్రభుత్వం తీపి కబురు అందించింది. ఇప్పటికే పలు శాఖల్లో భారీగా నోటిఫికేషన్లు జారీ చేసిన ప్రభుత్వం తాజాగా విద్యుత్ శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నోటిపికేషన్ ద్వారా నార్తర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఆఫ్ తెలంగాణ ( టీఎస్ ఎన్ పిడిసిఎల్) లో  2,553 ఉద్యోగాలను భర్తీ చేపట్టనున్నారు. దీంతో నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పించడంతో పాటు క్షేత్ర స్థాయిలో విద్యుత్ సమస్యలను తగ్గించడానికి ప్రయత్నిస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది.

ఈ ఉద్యోగాలకు సంబంధించిన వివరాలను టీఎస్ ఎన్‌పీడీసీఎల్ తన అధికారిక వెబ్‌సైట్ లో పొందుపర్చారు. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా వున్న 2,553 జూనియర్ లైన్‌మన్ పోస్టులను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. ఈ ఉద్యోగాలకు ఆన్ లైన్ ద్వారా  ఫిబ్రవరి 22,2018 నుంచి మార్చి 19,2018లోగా అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఈ ఉద్యోగాలకు ఉమ్మడి ఎపి లేదా తెలంగాణ లో 10 వ తరగతిలో ఉత్తీర్ణులై, ఎలక్ట్రికల్ ట్రేడ్/వైర్‌మన్ లేదా ఎలక్ట్రికల్ ట్రేడ్‌లో డిప్లొమా చదివిన వారు అర్హులు. ఈ ఉద్యోగుల జీతభత్యాలు రూ. 15,585-25,200 వరకు ఉంటాయని వెబ్ సైట్ లో పొందుపర్చారు.