ఇకపై జంతర్ మంతర్ వద్ద నిరసనలు జరపరాదు వాటి వల్ల శబ్ద కాలుష్యం పెరుగుతోందన్న గ్రీన్ ట్రిబ్యునల్
ఢిల్లీలోని ధర్నా చౌక్ పై జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్ సంచలనాత్మక తీర్పు వెలువరించింది. ప్రస్తుతం ధర్నాలు జరుగుతున్న జంతర్ మంతర్ రహదారి వద్ద ప్రస్తుతం చేపడుతున్న నిరసనలు, ధర్నా, ఆందోళన, దీక్షా కార్యక్రమాలు తక్షణమే ఆపాలని ఢిల్లీ ప్రభుత్వానికి, ఢిల్లీ పోలీసులకు ట్రిబ్యునల్ ఆదేశించింది.
ఇలా నిత్యం జంతర్ మంతర్ వద్ద నిరసనల పేరుతో ఆ ప్రాంతంలో శబ్ద కాలుష్యానికి కారణమవుతున్న వారిపై కఠినంగా వ్యవహరించాలని ఎస్జీటి సూచించింది. దీని వల్ల డిల్లీ ప్రజలకే కాదు, ఇక్కడ పర్యావరణానికి కూడా హాని కలిగేలా ఉందని పేర్కొంది. అందువల్ల అక్కడ నిరసన కార్యక్రమాలు చేపట్టకూడదని గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశించింది. ప్రస్తుతం అక్కడ వున్న తాత్కాలిక నిర్మాణాలను, టెంట్ లను, లౌడ్ స్పీకర్లను తొలగించి ఇక మీదట ఇక్కడ ఎలాంటి శబ్ద కాలుష్యాన్ని సృష్టించే కార్యక్రమాలు జరగకుండా చూడాలని ఆదేశించింది.
డిల్లీలో నిరసనలకు నిలయంగా మారి ధర్నా చౌక్ గా పేరుపొందిన జంతర్ మంతర్ వద్ద అనేక రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు ప్రభుత్వాలకు వ్యతిరేకంగా, ప్రజలకు అనుకూలంగా ఎన్నో నిరసనలు చేపడుతుంటారు. అలాంటి చోట ధర్నాలు, నిరసనలు చేపట్టరాదన్న హరిత ట్రిబ్యునల్ ఆదేశాలు ఏ మేరకు అమలవుతాయో చూడాలి.
