నల్లగొండ జిల్లా మర్రిగూడలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అర్దరాత్రి రోడ్డుపై నడుచుంకుంటూ వెళుతున్న ముగ్గురు వ్యక్తులను డీసీఎం వ్యాను ఢీ కొట్టడంతో వారు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు ముగ్గురు నల్గొండ జిల్లాలో హత్యకు గురైన మున్కిపల్ ఛైర్ పర్సన్ లక్ష్మీ భర్త బొడ్డుపల్లి శ్రీను సంతాప సభలో పనిచేయడానికి వెళ్లారు.  బస్ స్టాప్ నుండి సంతాప సభ జరిగే ప్రాంతానికి నడుచుకుంటూ వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది.

వివరాల్లోకి వెళితే కృష్ణా జిల్లా చెన్నూరుకు చెందిన హేమంత్‌, కంచికర్లకు చెందిన వాసిరెడ్డి మురళి, మేడ్చల్ జిల్లా కీసరకు చెందిన సనీల్‌ లు హైదరాబాద్ లో  క్యాటరింగ్ పనులు చేస్తుంటారు. ఈ క్రమంలో ఇవాళ నల్గొండ పట్టణంలో జరిగే బొడ్డుపల్లి శ్రీను సంతాప సభలో క్యాటరింగ్ పనులు చేయడానికి హైదరాబాద్ నుండి బయలుదేరి నిన్న అర్థరాత్రి సమయంలో నల్గొండ పట్టణంలో దిగారు. అయితే వీరు అద్దంకి నార్కెట్‌పల్లి రోడ్డులోని మర్రిగూడ బైపాస్ వద్ద బస్సు దిగాల్సింది పోయి తెలియక ముందుకు వెళ్లి దిగారు. అక్కడి నుంచి తిరిగి నడుచుకుంటూ వస్తుండగా డీసిఎం వ్యాను ఢీ కొట్టడంతో మృత్యువాత పడ్డారు. 

ప్రమాద ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం నల్గొండ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అలాగే ప్రమాదం పై  కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.