ముమైత్ ఖాన్ 27 న సిట్ ముందుగా బిగ్ బాస్ ని వదలాల్సిందే. బయటికి వస్తున్న మరిన్ని పేర్లు.

డ్ర‌గ్స్ కుంభ‌కోణంలో ఎంత మంది సినిమా స్టార్స్ చిక్కుకున్నప్పటికీ ముమైత్ ఖాన్ కు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఛార్మి, సుబ్బరాజు, పూరి జగన్నాథ్ లాంటి స్టార్స్ ఎందరున్నా ముమైత్ తాలూకు విషయాలపై ఇటు జనాలు, అటు మీడియా విపరీతమైన ఆసక్తి ప్రదర్శిస్తోంది. ఇదే విషయాన్ని ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టర్ అకున్ సభర్వాల్ కూడా కామెంట్ చేశారు. అందరూ ఎక్కువగా ముమైత్ ఖాన్ గురించే అడుగుతున్నరేంటని ఆయన ఒకింత ఆశ్చర్యం వ్యక్తం చేశారు. 

డ్రగ్స్ కేసులో గత మూడు రోజుల‌గా పూరీని, శ్యామ్ కే నాయుడిని, నేడు సుబ్బరాజును విచారించింది సిట్. రేపు త‌రుణ్ ని విచారించనుంది. త్వ‌ర‌లో చార్మీ, ముమైత్ ఖాన్‌ని కూడా ప్ర‌శ్నించ‌నుంది. అయితే బిగ్ బాస్ షోలో ఉన్న ముమైత్ ఖాన్‌ని ప్ర‌శ్నిస్తారా లేదా అనే సందిగ్థ‌త‌కు తెర దించారు అకున్ సభర్వాల్. ఈ నెల 27వ తేదీన ముమైత్ ఖాన్ స్పెష‌ల్ టీం ముందుకు వ‌స్తుంద‌ని ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మేంట్ అధికారి అకున్ స‌బ‌ర్వాల్ తెలిపారు. బిగ్‌బాస్ నిబంధ‌న‌ల ప్ర‌కారం ఎలాంటి బ‌య‌టి కార‌ణాలు లేకుండా హౌజ్ నుండి బ‌య‌టికి పంప‌రు, మ‌రీ ముమైత్ ఖాన్ సిట్ టీం ముందుకు వ‌స్తుంద‌ని అధికారులు చెబుతున్నారు.


డ్ర‌గ్స్ వ్య‌వ‌హారంలో ప్ర‌తి రోజు కొత్త వారి పేర్లు బ‌య‌టికి వ‌స్తూనే ఉన్నాయి. అయితే ఇప్పుడు న‌గ‌రంలో ఉన్న 17 ప‌బ్ ఓన‌ర్ల‌కు నోటీసులు ఇచ్చారు. మ‌రో 21 మంది ప‌బ్ యాజ‌మానుల‌కు కొత్త‌గా నోటీసులు ఇవ్వ‌నున్నార‌ని తెలుస్తుంది. రేపటి నుంచి పబ్ ఓనర్లను కూడా విచారించనున్నారు. న‌గ‌రంలో ఉన్న అన్ని ప‌బ్ ఓన‌ర్ల‌ను ప్ర‌శ్నిస్తామ‌ని అకున్ స‌బ‌ర్వాల్ తెలిపారు. ముమైత్ ఖాన్ ఎప్పుడెప్పుడు విచారణకు హాజరవుతుందా అన్న ఉత్కంఠకు ఎక్సైజ్ పోలీసులు తెర దించారు. మరి ముమైత్ ఖాన్ ఇక్కడికొస్తుందా? లేక ఆమె వద్దకు సిట్ పోతుందా అన్నది తేలాలంటే కొద్దిరోజులు ఆగాలి.