ప్రాణాలను కాపాడాల్సిన ఓ వైద్య పరికరం ఓ వ్యక్తి ప్రాణాలను బలితీసుకుంది.  ఈ అరుదైన విషాద సంఘటన ముంబైలో చోటుచేసుకుంది. ఇంతకీ ఇలా ప్రాణాలను బలి తీసుకున్న యంత్రం ఏమిటి, దానివల్ల ఓ వ్యక్తి ఎలా చనిపోయాడో తెలుసుకోవాలంటే కింది స్టోరీ చదవాల్సిందే.

వివరాల్లోకి వెళితే  ముంబైలోని బీఐఎల్ నాయర్ చారిటబుల్ హాస్పిటల్లో ఓ వృద్దురాలు చికిత్స పొందుతోంది.  ఆమెకు వైద్య పరీక్షల్లో భాగంగా ఎమ్మారై తీయించడానికి ఎమ్మారై రూం లోకి తీసుకెళ్లారు. అయితే ఆమెతో పాటు రాజేష్ అనే యువకుడు ఆక్సిజన్ సిలిండర్ ను తీసుకుని ఆ గదిలోకి వెళ్లాడు. అయితే ఆ రూం లోకి మెటల్ వస్తువులు అనుమతించరు. అయినప్పటికి అక్కడి వార్డు బాయ్ సూచన మేరకు రాజేష్ ఆక్సిజన్ సిలిండర్‌తో లోనికి తీసుకెళ్లాడు. దీంతో  అతను లోపల అడుగుపెట్టగానే.. సిలిండర్ దానంతట అదే లీకవడం మొదలైంది. అంతే కాకుండా ఎమ్మారై మెషీన్‌లోని అయస్కాంత క్షేత్రం సిలిండర్‌తో పాటు రాజేష్‌ను కూడా లోపలికి లాక్కున్నది.  ఈ ప్రమాదంలో రాజేష్ చేయి పూర్తిగా మెషీన్‌లో ఇరుక్కుపోయింది. అయితే అక్కడ వున్నవారు అతన్ని ఎలాగోలా మెషీన్ నుంచి బయటకు తీశారు. కానీ అప్పటికే అతడు చేతిని కోల్పోయి తీవ్ర గాయాలపాలయ్యాడు. వెంటనే బాధితుడిని ఎమర్జెన్సీ  వార్డుకు తరలించి చికిత్స అందించినా ఫలితం లేకుండా పోయింది. గాయాలపాలైన పది నిమిషాల్లోనే అతడు మృతి చెందాడు.

 ఆస్పత్రి సిబ్బంది నిర్లక్ష్యం  వల్లే రాజేష్ చనిపోయాడని బందువులు ఆరోపిస్తున్నారు. అంతా తెలిసిన సిబ్బంది సూచనలతోనే రాజేష్ సిలిండర్ ఆ గదిలోకి తీసుకెళ్లాడని, ఆ సమయంలో అక్కడే ఉన్న డాక్టర్లు కూడా ఏమీ అడ్డు చెప్పలేదని మృతుడి బావ  హరీష్ సోలంకి చెప్పాడు. బంధువుల ఫిర్యాదు మేరకు ఆసుపత్రిపై పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు.  ఈ ఘటనలో తప్పెవరిదైనా.. ఎమ్మారై స్కానింగ్ యంత్రం ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకుంది.