టీఆర్ఎస్ పార్టీని వీడనున్నట్లు సోషల్ మీడియాలో వస్తున్న కథనాలపై మంత్రి హరీష్ రావు మండిపడ్డారు.  ఇలా తప్పుడు ప్రచారం చేసి, పిచ్చిరాతలు రాస్తూ తన ఇమేజ్ డ్యామేజ్ చేయడానికి చూస్తున్నారని అన్నారు. ఇలా సోషల్ మీడియాలో తన మార్ఫింగ్ ఫోటోలు పెట్టి తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని డిజిపిని కోరినట్లు హరీష్ తెలిపారు. తానో క్రమశిక్షణ గల టీఆర్ఎస్ కార్యకర్తని ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాలని, ఇలాంటి పుకార్లను నమ్మొద్దని సూచించారు.

 
తెలంగాణ సీఎం కేసీఆర్ బాటలోనే తాను ఎల్లపుడూ నడుస్తుంటానని హరీష్ స్పష్టం చేశారు. తాను పార్టీ మారుతున్నట్లు సోషల్ మీడియాలో వస్తున్న వార్తలను చిల్లర వార్తలని, వాటిని ఎవరూ పట్టించుకోవాల్సిన అవసరం లేదని అన్నారు.ఇలా అవాస్తవాలను ప్రచారం చేస్తూ పూటగడుపుకోవడం మానుకోవాలని సూచించారు. తన పుట్టుక టీఆర్ఎస్ లోనే..చావు కూడా టీఆర్ఎస్ లోనేనని హరీశ్ రావు పునరుద్ఘాటించారు. ఇప్పటికే ఈ విషయంపై తాను అనేకసార్లు వివరణ ఇచ్చానని, ఇలాంటి వార్తల్ని రాయొద్దని మీడియా మిత్రులకు సూచిస్తున్నట్లు తెలిపారు. తాను టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తగా ఎల్లపుడూ అధినేత కేసీఆర్ ఆదేశాలు శిరసా వహిస్తానని హరీష్ తెలిపారు. ఈ వార్తలను తాను ఖండిస్తున్నానని, మరోసారి ఇలాంటి వార్తలు రాసిన వారిని, ప్రచురించిన సంస్థలపై  కఠిన చర్యలు తీసుకోమని పోలీసులకు సూచించినట్లు మంత్రి హరీష్ తెలిపారు.