తెలంగాణ రాష్ట్రంలో ఆడపడుచులు కుటుంబానికి భారం కాకూడదని వారి పెళ్లికోసం ప్రభుత్వం ఆర్థిక సాయం అందిస్తున్న విషయం తెలిసిందే. కళ్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ పేర్లతో తెలంగాణ ప్రభుత్వం పేదింటి ఆడపడుచుల ఇప్పటివరకు అందిస్తున్న రూ.75,116 సహాయాన్ని లక్షా నూట పదహారు రూపాయలకు పెంచుతున్నట్టు సీఎం కేసీఆర్ శాసనసభ సాక్షిగా ప్రకటించారు. ఈ ప్రకటనతో  సీఎం మరోసారి పేద ప్రజల, ఆడపడుచుల అభ్యున్నతి పట్ల తనకున్న ఆలోచనను బైటపెట్టారు.

 

ఇలా మహిళలకు అండగా నిలుస్తున్న కేసీఆర్‌కు తెలంగాణ  మహిళలే కాదు యావత్ తెలంగాణ ప్రజలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. ఇందులో భాగంగా యాదాద్రి భువనగిరి జిల్లాలో మొటకొండూర్ మండల కేంద్రంలో టీఆర్‌ఎస్ పట్టణ మహిళా అధ్యక్షురాలు బొలగాని నాగమణిమోహన్ గౌడ్ ఆధ్వర్యంలో మహిళలు సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. అలాగే  నిజామాబాద్ జిల్లా అర్చన్ పల్లిలో కూడా టీఆర్ఎస్ నాయకులు కొందరు గ్రామ మహిళలతో కలిసి సీఎం ప్లెక్సీకి పాలాభిషేకం చేశారు. 

అసెంబ్లీలో కేసీఆర్ మాట్లాడుతూ తనకు వ్యక్తిగతంగా తన హృదయానికి ఎంతో దగ్గరైన పథకం కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ అని చెప్పడం ఆయనకు మహిళలు, పేదల పట్ల ఉన్న ప్రేమను తెలియజేస్తుందని టీఆర్ఎస్ మహిళా నాయకులు తెలిపారు. వీటికి సంబంధించిన  చెక్కులు తీసుకొంటున్న సమయంలో తమకందిన సహాయానికి సంతోషిస్తూ, ఆడపిల్లల తల్లులు ఆనందబాష్పాలతో తమ ప్రభుత్వాన్ని దీవిస్తున్నారని మహిళా నాయకులు తెలిపారు.