ట్రాఫిక్ నియంత్రణ కోసం హైదరాబాద్ చుట్టూ నిర్మించిన ఔటర్ రింగ్ రోడ్డు ప్రయాణికుల పాలిట మృత్యు శకటంగా మారింది. ఈ రోడ్డుపై మితిమీరిన వేగంతో ప్రయాణిస్తూ వాహనాలు ప్రమాదాల బారిన పడుతున్నాయి.ఈ ప్రమాదాల్లో అనేక మంది మృత్యువాత పడుతున్నారు. తాజాగా ఔటర్ పై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు చనిపోయారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.
 
రంగా రెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం కొంగర కలాన్ సమీపంలోని ఔటర్ రింగురోడ్డుపై ఘోర ప్రమాదం జరిగింది.  పెద్ద అంబర్‌పేట నుంచి తుక్కుగూడ వైపు వెళ్తున్న ట్రాలీ అదుపుతప్పి లారీ కంటైనర్ ను ఢీకొట్టింది. దీంతో కంటైనర్ ముందు వెళ్తున్న బోలెరో వాహనాన్ని ఢీకొనడంతో ఆ వాహనంలో ఉన్న ఇద్దరు మృతి చెందారు.  మృతులను తుమ్మలూరుకు చెందిన శ్రీశైలం(47), మహారాష్ట్రకు చెందిన కెబ్రా(35)గా గుర్తించారు. 

ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న ఆదిభట్ల పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అలాగే మృతదేహాలను ఇబ్రహీంపట్నం ప్రభుత్వ ఆసుపత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.