మాతృమూర్తి అంటే మానవత్వానికి ప్రతీక. పిల్లలను కంటికి రెప్పలా కాపాడుతూ తన ప్రేమను పంచుతూ అల్లారుముద్దుగా చూసుకునే మాతృమూర్తులను మనం చూస్తుంటాం. కానీ నవమాసాలు మోసి కన్న చిన్నారిని కాలువలో పడేసి కర్కశానికి మారుపేరుగా నిలిచిన ఓ కన్నతల్లిని పోలీసులు అరెస్ట్ చేసిన సంఘటన విజయవాడలో జరిగింది.  

వివరాల్లోకి వెళితే నూజివీడుకు చెందిన ఓ మహిళకు నాలుగేళ్లక్రితం మేనమామతో వివాహమైంది. అయితే భర్తతో మనస్పర్ధలు రావడంతో పుట్టింట్లోనే ఉంటోంది. అయితే ఆమె ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తోంది. ఈ క్రమంలో అదే కంపెనీలో పనిచేసే ఓ సహోద్యోగితో పరిచయం ఏర్పడింది. అదికాస్తా అక్రమసంభందంగా మారడంతో సదరు మహిళ గర్భం దాల్చింది. దీంతో ఊళ్లోనే వుంటే పరువు పోతుందని భావించిన ఆమె తల్లి తమ మకాం విజయవాడకు మార్చారు. ఈ క్రమంలో ఆమె విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో ఓ ఆడశిశువుకు జన్మనిచ్చింది.

 అయితే ఆస్పత్రి నుంచి డిశ్చార్జి కాగానే ఆ తల్లిలో మృగం మేల్కొంది. వారు విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రం వద్దకు రాగానే పట్పాత్ నుంచి శిశువును రైవస్ కాలువలో పడేశారు. తర్వాత తమకు ఏమీ తెలీదన్నట్లుగా ఇంటికెళ్లిపోయారు.

అయితే ఆ చిన్నారి మృతదేహం కాలువలో కొట్టుకువచ్చి స్థానిక తహసీల్దార్‌ కార్యాలయం వెనుకవైపు నీటిలో చెత్తలో చిక్కుకుపోయింది. దీన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో శిశువు మృతదేహాన్ని బయటకు తీసిన పోలీసులు చేతికి ఉన్న తెలుపుబ్యాండ్ ఆధారంగా ధర్యాప్తు మొదలుపెట్టారు. ఈ విధంగా ఆస్పత్రుల్లోనే బ్యాండ్ వేస్తారని గుర్తించిన పోలీసులు ఆస్పత్రుల్లో విచారణ చేయగా నిందితులు బయటకువచ్చారు.దీంతో పోలీసులు శిశువు తల్లి, అమ్మమ్మను అదుపులోకి తీసుకుని హత్య కేసు నమోదు చేశారు.