వాళ్లు ప్రాణానికి ప్రాణంగా ప్రేమించుకున్నారు. పెద్దలకు ఎదిరించి మరీ పెళ్లి చేసుకున్నారు. తమ వల్ల తమ కుటుంబాల మద్య వైరం పెరగొద్దన్న ఉద్దేశంతో ఊరు విడిచి వెళ్లిపోయారు. అయితే తమ కూతురిని ఈ యువకుడు బలవంతంగా ఎత్తుకెళ్లాడని పోలీసులకు ఫిర్యాదివ్వడంతో భయపడిపోయిన జంట ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన కళ్యాణ దుర్గంలో చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెళితే అనంతపురం జిల్లా శెట్టూరు మండలం అయ్యగార్లపల్లికి చెందిన చిట్టెమ్మ (18) అదే గ్రామానికి చెందిన భరత్‌(21)లు కొన్నాళ్లుగా ప్రేమించుకున్నారు. అయితే వీరి ప్రేమకు అడ్డురాని కులాలు పెళ్లికి మాత్రం అడ్డొచ్చాయి. ఇరు వైపుల పెద్దలు పెళ్లికి ఒప్పుకోకపోడంతో విడిపోయి ఉండలేక ఊరి ఈ జంట నుండి పరారయ్యారు. నేరుగా బెంగుళూరుకు వెళ్లి అక్కడి నుంచి తిరుపతికి చేరుకుని అక్కడ పెళ్లి చేసుకున్నారు. ఈ పెళ్లికి భరత్ స్నేహితులు సహకరించారు.  

అయితే తమ కూతురిని భరత్ బలవంతంగా ఎత్తుకెళ్లాడని స్థానిక పోలీస్ స్టేషన్లో యువతి తల్లిదండ్రులు ఫిర్యాధు చేశారు. దీంతో పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఈ జంట ఆచూకీ కోసం భరత్ స్నేహితులను పోలీస్ స్టేషన్ కు పిలిచిన పోలీసులు తమదైన శైలిలో విచారించారు. ఈ విషయంతెలిసిన ఈ ప్రేమ జంట తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఇక పోలీసులు తమను పట్టుకుని విడదీస్తారని భావించిన వీరు విడిపోవడం కంటే ఆత్మహత్యే మేలనుకున్నారు. దీంతో కళ్యాణ దుర్గం పట్టణ సమీపంలోని అయ్యవారు గుట్ట కొండలోని గుహలోకి వెళ్లి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు.