ఇవాళ ఉదయం ముఖ్యమంత్రి కేసీఆర్ తప్పిన ప్రమాదంపై ఐటీ మంత్రి కేటీఆర్ స్పందించారు. ఆదిలాబాద్ జిల్లా పర్యటనకు ప్రత్యేక హెలిక్యాప్టర్ లో సీఎం బయలుదేరే సమయంలో హెలిక్యాప్టర్ లోని  ఓ బ్యాగులో మంటలు చెలరేగాయి. ఈ సంఘటన పై కేటీఆర్ ట్విట్టర్ ద్వారా స్పందించారు. ఆల్ ఈజ్ వెల్ అంటూ ట్వీట్ చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ క్షేమంగా ఉన్నారని తెలిపారు. ఆదిలాబాద్ జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటన కొనసాగుతోందని కేటీఆర్ ట్వీట్ చేశారు.

నిన్న కరీంనగర్ లో జరిగిన రైతు సమన్వయ సమితుల ప్రాంతీయ అవగాహన సదస్సు లో సీఎం కేసీఆర్ పాల్గొన్నారు.  సాయంత్రం వరకు ఈ సదస్సు ముగిసిన తర్వాత కరీంనగర్ మండల తీగల గుట్టపల్లెవద్ద గల తన నివాసంలో కేసీఆర్ బస చేశారు. అక్కడినుండి పెద్దపల్లి లో జరిగే కార్యక్రమంలో పాల్గొనడానికి సీఎం ప్రత్యేక హెలిక్యాప్టర్ లో బయలుదేరడానికి సిద్దమయ్యారు. ఈ క్రమంలో ఆయన హెలిక్యాప్టర్ ఎక్కిన కొన్ని క్షణాల్లో ఒక బ్యాగ్ నుంచి పొగలు రావడాన్ని సీఎంవో అధికారులు గుర్తించారు. పొగలు చిమ్మే బ్యాగును సీఎం సెక్యూరిటీ సిబ్బంది హెలిక్యాప్టర్ కు 100 మీటర్ల దూరంలో పారేశారు. దీంతో కొద్దిసేపు అక్కడ ఏమైంతుందో తెలీక గందరగోళం నెలకొంది. ఆ బ్యాగును పరిశీలించిన పోలీసులు హెలిక్యాప్టర్ లోని వైర్ లెస్ సెట్ కోసం  అమర్చిన పరికరాల కారణంగానే  మంటలు లేచాయని నిర్ధారించారు.

 సీఎం ప్రయాణిస్తున్న హెలిక్యాప్టర్ కు గానీ, కేసీఆర్ కు గానీ ఎలాంటి ప్రమాదం జరక్కపోడంతో పోలీసులు, సీఎంవో సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు.