నిరుద్యోగుల తరపున పోరాటానికి సిద్దమైన జేఏసి నిరుద్యోగుల సత్తాను ప్రభుత్వానికి చూపించాలని చూస్తోంది. వారు ఉద్యోగాల కోసం ఎంత ఆవేదన చెందుతున్నారో ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ''కొలువుల కై కొట్లాట'' సభను నిర్వహిస్తోంది. ఈ సభను నిర్వహణ కోసం జేఏసి తెలంగాణ ప్రభుత్వంతో ఓ చిన్న యుద్దమే చేసింది. అయినా ప్రభుత్వం అనుమతించకపోవడంతో హై కోర్టు నుంచి సభకు అనుమతి తెచ్చుకుంది. దీంతో ఎలాగైనా ఈ సభను విజయవంతం చేసి ప్రభుత్వానికి  గట్టి హెచ్చరికలు పంపాలని చూస్తోంది. అందుకోసం ఈ నెల 4 వ తేదీన సరూర్ నగర్ స్టేడియంతో కొలువులకై కొట్లాట సభను నిర్వహించాలని చూస్తోంది.

అందుకోసం జేఏసి చైర్మన్ కోదండరాంతో పాటు ఇతర నాయకులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. తెలంగాణ యువత కోసం పోరాడుతున్న అన్ని వర్గాలను కలుపుకుపోయి సభను విజయవంతంగా నిర్వహించాలని చూస్తోంది. అందుకోసం రాష్ట్రంలోని ప్రధాన పార్టీల మద్దతు కూడగట్టాలని జేఏసి భావిస్తోంది. అందుకోసం ప్రస్తుతం  కోదండరాం బీజేపి అద్యక్షుడు లక్ష్మణ్ తో భేటీ అయ్యారు. కొలువుల కొట్లాట సభకు పార్టీ తరపున మద్దతుగా నిలవాలని కోరారు. దీనికి లక్ష్మణ్ కూడా సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. ఇక తెలంగాణ లో ప్రధాన ప్రతిపక్షపైన కాంగ్రెస్ మద్దతుకోసం  కోదండరాం టీపిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డిని కూడా కలిశారు. ఈ సందర్భంగా ఆయన కొలువుల కొట్లాటకు ఉత్తమ్ ను ఆహ్వానించడంతో పాటు పార్టీ తరపున మద్దతు తెలపాలని కోరారు.

 

ఇప్పటికే ఉస్మానియా యూనివర్సిటీలో పర్యటించిన కోదండరాం అక్కడ విద్యార్థులతో, విద్యార్థి సంఘాలతో మాట్లాడి వారిని కొట్లాటకు సన్నద్దం చేశారు.అలాగే మెదక్, నల్గొండ, వరంగల్ జిల్లాల్లో పర్యటించి అక్కడి యువతను, ప్రజలను కొలువుల కొట్లాట సభలో  పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఇలా ఇప్పటికే ప్రజలనుంచి మద్దతు పొందిన సభకు తాజాగా రాజకీయ పార్టీల మద్దతు కూడగట్టి నిరుద్యోగుల కోసం నిర్వహిస్తున్న కొలువుల కోట్లాట సభను విజయవంతం చేయాలని కోదండరాంతో పాటు జేఏసి నాయకులు భావిస్తున్నారు.