తెలంగాణ ఉద్యమానికి ఊపిరి పోసి యువతలో నూతనోత్తేజాన్ని నింపిన సంఘటన మిలియన్ మార్చ్. ట్యాంక్ బండ్ పై జరిగిన ఈ మార్చ్ యావత్ తెలంగాణ ఉద్యమంలోనే అద్భుతమైన ఘట్టంగా ఉద్యమ చరిత్రలో నిలిచిపోయింది.  జేఏసి తలపెట్టిన ఈ మార్చ్ లో రాజకీయ పార్టీలు, ఉద్యోగ సంఘాలు, విద్యార్థి సంఘాలు ఇలా ఒక్కటేమిటి యావత్ తెలంగాణ ట్యాంక్ బండ్ పైనే ఉందా అన్నట్లుగా పాల్గొని విజయవంతం చేశారు. ఈ నిరసనతో సీమాంద్ర నాయకుల గుండెల్లో గుబులు పుట్టించి మా తెలంగాణ మాకు కావాలని  తెలంగాణ ప్రజానికం నినదించింది. అలాంటి మిలియన్ మార్చ్ ని ఉద్యమనాయకుడిగా చెప్పుకుంటున్న సీఎం కేసీఆర్ అవమానిస్తున్నాడని కోదండరాం ఆరోపించారు. తెలంగాణ  ఏర్పాటుకు మార్గం సుగమం చేసిన ఈ చారిత్రక ఘట్టాన్ని కేసీఆర్ అవమానించాడంటే అది తెలంగాణ ప్రజలందరిని అవమానించినట్లేనని కోదండరాం విమర్శించారు.

అరెస్టులను ఖండించిన కోదండరాం

2011 మార్చ్ 10 న జరిగిన మిలియన్ మార్చ్ ని గుర్తుచేసుకుంటూ ఆ స్పూర్తిని తెలంగాణ ప్రజల్లో మరోసారి నింపాలని జేఏసి బావించి రేపు ''మిలియన్ మార్చ్ స్ఫూర్తి'' సమావేశాన్ని తలపెట్టిన విషయం తెలిసిందే. అయితే ఈ సమావేశంలో హింస చెలరేగే అవకాశం ఉందంటూ పోలీసులు అనుమతిని నిరాకరించారు. అంతే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా టీజేఏసీ నాయకులను, కార్యకర్తలను విచ్చలవిడిగా అరెస్టులు చేస్తున్నారని జేఏసి ఛైర్మన్ కోదండరాం తెలిపారు.  ఈ అరెస్టులు, నిర్బందాల ద్వారా తెలంగాణ  ప్రజల ప్రజాస్వామిక ఆకాంక్షలను అణచలేరని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ అరెస్టులను టీజేఏసీ తీవ్రంగా ఖండిస్తోందని, అరెస్టుచేసిన అందరినీ తక్షణం విడుదలచేయాలని కోదండరాం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.  

అయితే ట్యాంక్ బండ్ పై ఇప్పుడు తలపెట్టింది మరో మిలియన్ మార్చ్ కాదని, కేవలం మిలియన్ మార్చ్ స్ఫూర్తి తో తలపెట్టిన సమావేశం మాత్రమేనని వివరణ ఇచ్చారు కోదండరాం. అలాంటి సమావేశాన్ని మిలియన్ మార్చ్ తో పోల్చి హింస చెలరేగే అవకాశం ఉందని అనుమతి నిరాకరించడం హాస్యాస్పదంగా ఉందన్నారు. కేవలం ఆటా,పాటా,మాటలతో నిర్వహించాలని తలపెట్టిన సమావేశమని, సెలబ్రిటీలతో విందులు, చిందులు, సెల్ఫీలకోసం చేస్తున్నది కాదని ఘాటుగా విమర్శించారు. విలాసాలకోసం నిర్వహించిన సమావేశాలకోసం ట్యాంక్ బండ్ దారుల్నిను మూసి,దారి మళ్లించిన సందర్భాలు అనేకం ఉన్నాయన్నారు. అలాంటిది ప్రజల కోసం చేస్తున్న కార్యక్రమానికి అనుమతి నిరాకరించడం ఏంటని ప్రశ్నించారు. అహంకార పాలకులకు గుణపాఠం చెప్పిన "మిలియన్ మార్చ్" తెలంగాణ ప్రజలకు, ఉద్యమకారులకు ఎల్లప్పుడూ స్ఫూర్తి నింపుతూనే ఉంటుందని కోదండరాం అన్నారు.