జనసేన అధినేత, యాక్టర్ పవన్ కళ్యాణ్ పై బిజెపి ఎమ్మెల్యే కిషన్ రెడ్డి విరుచుకుపడ్డారు. ఆయనకు యాక్టింగే సరిగా రాదనుకుంటే ఇపుడు రాజకీయాలు చేయడానికి బయలుదేరాడని మండిపడ్డారు. ఆయన రాజకీయ నాయకుడిగా పనికిరాడని పేర్కొన్నారు. అన్న చిరంజీవిని అడ్డం పెట్టుకుని నటుడిగా వచ్చాడని  అన్నారు. కానీ యాక్టింగ్ ఎలా చేయాలో నేర్చుకోలేక పోయాడని, పవన్ కంటే చిరంజీవి కొడుకు రాంచరణ్ అద్భుతంగా నటిస్తాడని అన్నారు. కొన్నిసార్లు పవన్ కళ్యాణ్ నటన చూస్తే నవ్వొస్తుంటుందన్నారు. మీడియాలో ఇష్టాగోష్టిగా మాట్లాడిన కిషన్ రెడ్డి ఇంకా పలు విషయాల గురించి మాట్లాడారు.

టీడిపి లోంచి కాంగ్రెస్ లోకి చేరిన రేవంత్ రెడ్డి పై  కూడా పలు ఆసక్తికర కామెంట్స్ చేశారు కిషన్ రెడ్డి. రేవంత్ రెడ్డి బిజేపిలోకి వచ్చినా ఇక్కడ ఇమడలేకపోయేవారని అన్నారు. బిజేపి పార్టీలో వ్యక్తిగత దూషనలు ఉండవని, చాలా క్రమశిక్షనగా ఉండాల్సి ఉంటుందని అది రేవంత్ వల్ల కాకపోయేదన్నారు.

 2019 సార్వత్రిక ఎన్నికల్లో తెలంగాణలో బిజేపి బలమైన శక్తిగా ఎదిగేందుకు ప్రణాళికలు రచిస్తున్నట్లు తెలిపారు. అందుకోసం తెలంగాణలో అమిత్ షా పర్యటనను ఫ్లాన్ చేశామని, దీనిపై రేపు జరిగే కోర్ కమిటీ సమావేశంలో చర్చించనున్నట్లు వివరించారు. ఇక రాష్ట్రంలో పాదయాత్ర చేసి పార్టీని బలోపేతం చేసే మరో ఆలోచన కూడా ఉందన్నారు. ఇప్పటికిప్పుడు రాష్ట్రంలో ఎన్నికలు జరిగితే హంగ్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్నారు కిషన్ రెడ్డి.