ఖమ్మం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కొణిజర్ల మండలం పల్లిపాడు సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో నూతనంగా పెళ్లి చేసుకున్న పెళ్లికొడుకుతో పాటు నలుగురు బందువులు అక్కడికక్కడే మృతి చెందారు. పెళ్లి కూతురితో పాటు మరో ముగ్గురు చిన్నారులకు తీవ్ర గాయాలపాలైంది. ఈ ప్రమాదానికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. 

ఆంధ్రప్రదేశ్ లోని పశ్చిమగోదావరి జిల్లా తణుకుకు చెందిన అమ్మాయితో వరంగల్ జిల్లా వర్థన్నపేటకు చెందిన రామకృష్ణ ప్రసాద్ ల వివాహం నిన్న రాత్రి వధువు ఇంట్లో జరిగింది. వివాహానంతరం ఇవాళ ఉదయం వదూవరులు, వారి బందువులు కొందరు కలిసి ఇన్నోవా కారులో వరంగల్ కు బయలుదేరారు. ఈ క్రమంలో ఖమ్మం జిల్లా కొణిజెర్ల సమీపంలో కారు అదుపుతప్పి రోడ్డు పక్కన వున్న చెట్టుకు ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో వరుడు రామకృష్ణ ప్రసాద్, శేషాచలపతి, పద్మ, శ్రీదేవి, వేణు లు అక్కడికక్కడే మృతి చెందగా, వదువుతో పాటు ముగ్గురు చిన్నారులకు తీవ్ర గాయాలయ్యాయి.  క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఖమ్మం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదంతో పెండ్లింట తీవ్ర విషాదం నెలకొంది.

సంఘటన స్థలానికి వైరా ఏసీపి ప్రసన్న కుమార్ సిబ్బందితో చేరుకుని మృతదేహాలను పరిశీలించారు. ఈ ప్రమాదంలో రహదారిపై ఏర్పడ్డ ట్రాఫిక్ ను క్లియర్ చేసి, మృతదేహాలను ఖమ్మం హాస్పిటల్ కి తరలిస్తున్నారు.

 

వీడియో