కర్ణాటకలో ఓడిన ఇద్దరు తెలుగు ముఖ్యమంత్రులు

Karnataka Telugu Voters acted against CMs of Telugu states
Highlights

తెలుగు, కన్నడ హాట్ న్యూస్..

కర్ణాటక ఎన్నికలు దేశంలోనే సంచలనం రేపాయి. కన్నడనాట ఎన్నికల ఫలితాలను ప్రభావం చేసేందుకు తెలుగు రాజకీయ నేతలు పోటీ పడ్డారు. ఏకంగా ఇద్దరు తెలుగు ముఖ్యమంత్రులు అక్కడ తమ మద్దతుదారులను గెలిపించేందుకు పోరాటం చేశారు. కానీ ఇద్దరు తెలుగు ముఖ్యమంత్రులూ ఓడిపోయారు. తెలంగాణ సిఎం కేసిఆర్, ఆంధ్రా సిఎం చంద్రబాబు ఇద్దరూ ఘోర పరాభవాన్ని మూటగట్టుకున్నారు. వాళ్లేమీ పోటీ చేయలేదు కదా? మరి ఓడిపోయినట్లు ఎట్ల అంటారా? అయితే చదవండి ఫుల్ స్టోరీ.

కర్ణాటక ఎన్నికల హడావిడి మొదలైన నాటినుంచి అక్కడ చక్రం తిప్పేందుకు తెలుగు సిఎంలు ఇద్దరూ ప్రయత్నించారు. ఎన్నికల ముందే తెలంగాణ సిఎం కేసిఆర్ కర్ణాటక వెళ్లి అక్కడ జెడిఎస్ పెద్దలు దేవేగౌడ, కుమారస్వామితో భేటీ అయ్యారు. వాళ్లతో కలిసి భోజనం చేశారు. రానున్న ఎన్నికల్లో వాళ్లకు మద్దతివ్వాలని కర్ణాటకలో స్థిరపడ్డ తెలంగాణ ఓటర్లకు కేసిఆర్ పిలుపు కూడా ఇచ్చేశారు. కానీ ఆయన పిలుపు అక్కడ ఏమంత గొప్పగా పనిచేయలేదు. జెడిఎస్ కు కేసిఆర్ పిలుపుతో పెద్దగా ఒరిగిందేం లేదు. అయితే కాంగ్రెస్, బిజెపి పార్టీలను అధికారానికి దూరం చేయాలన్న కేసిఆర్ ఆలోచన అక్కడ పారలేదు. తద్వారా కేసిఆర్ ఓటమి చెందినట్లే అని రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది.

ఇక చంద్రబాబుది మరీ విచిత్రమైన ఓటమి. ఆయన ఎవరో ఒకరికి మద్దతు ఇచ్చి వారిని గెలిపించాలని కోరిన పరిస్థితి లేదు. ప్రత్యేక హోదా ఇవ్వకుండా ఎపికి అన్యాయం చేసిన బిజెపిని ఓడించాలని ఆయన కన్నడనాట ప్రచారం చేశారు. టిడిపి బలగాలను అక్కడ మొహరించి మరీ బిజెపికి వ్యతిరేకంగా ప్రచారం చేయించారు. ఉద్యోగ సంఘాల నేతలను, కొందరు ప్రభుత్వ ఉద్యోగులను సైతం అక్కడ మొహరించారు చంద్రబాబు. స్పష్టంగా ఏదో ఒక పార్టీకి మద్దతివ్వకుండా బిజెపిని ఓడించండి అన్న నినాదం ఎత్తుకున్నారు. కానీ చంద్రబాబు నినాదం కన్నడ నాట ఏమాత్రం వర్కవుట్ కాలేదు. బాబు కోరిక ఫలించలేదు. ఆయన ఓడించాలని పిలుపునిచ్చిన బిజెపి పార్టే అధికారం చేజిక్కించుకున్నది. ఈరకంగా చంద్రబాబు కన్నడనాట ఓటమిపాలైనట్లు చెబుతున్నారు.

మొత్తానికి బిజెపికి ఓటేయొద్దు అని చంద్రబాబు ఓడిపోతే జెడిఎస్ కు ఓటేయండి అని చెప్పిన కేసిఆర్ కూడా కన్నడనాట ఓడిపోయారు. తెలుగు రాష్ట్రాల్లోనే ఇద్దరు ముఖ్యమంత్రులకు గట్టి ఎదురుగాలి వీస్తోంది. ఈ పరిస్థితుల్లో సొంత రాష్ట్రాల్లో రానున్న 2019 ఎన్నికల్లో ఓడిపోకుండా ప్రయత్నాలు చేసుకోవాల్సిందిపోయి కర్ణాటకలో మేం చక్రం తిప్పుతామంటూ బొక్కబోర్లా పడే ప్రయత్నం చేశారని రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చలు సాగుతున్నాయి. కన్నడ నేల మీద ఎలాగూ ఓడిపోయారు కాబట్టి ఇక్కడ తెలుగ నేలమీద ఓడిపోకుండా చూసుకోండి అని తెలుగు ప్రజలు చురకలు వేస్తున్నారు.

loader